బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ స్టోరీకి బిగ్ ట్విస్ట్.. కూతురి ప్రేమకు నో చెప్పిన పేరెంట్స్!

బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ స్టోరీకి బిగ్ ట్విస్ట్.. కూతురి ప్రేమకు నో చెప్పిన పేరెంట్స్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అంటేనే గొడవలు, గేమ్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇవన్నీ కామన్. ఈ షోలో హైప్ కోసం కొందరు ప్రేమికుల్లా నటిస్తే, మరికొందరు నిజంగానే మనసులు కలుపుకుంటారు. కానీ మలయాళ బిగ్‌బాస్ సీజన్ 8లో మాత్రం ఓ ప్రేమకథ ఊహించని మలుపు తిరిగింది. ప్రేమించిన వ్యక్తి కోసం పెళ్లి వరకు వెళ్లాలని భావించిన ఓ కంటెస్టెంట్‌కు సొంత తల్లిదండ్రుల నుంచే అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మలయాళ బిగ్‌బాస్ 8వ సీజన్‌కు స్టార్ హీరో మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న నేహా ఫాతిమా.. తోటి కంటెస్టెంట్ తషి రాజ్ అలియాస్ సంతోష్‌పై మనసు పారేసుకుంది. అతడంటే తనకు ఇష్టమని, షో పూర్తయ్యాక తల్లిదండ్రుల అంగీకారంతో ఈ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని ఉందని చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ షోలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అయితే వీరి ప్రేమకథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా చోటుచేసుకుంది. తషి మరో కంటెస్టెంట్ వేదాంగితో సరదాగా మాట్లాడుతున్నాడని తెలుసుకున్న నేహా అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత తషి.. వేదాంగిపై తనకు ఎలాంటి ప్రేమ లేదని నేహాకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తషి కూడా నేహాపై తనకున్న ఇష్టాన్ని గతంలో మరో కంటెస్టెంట్‌తో పంచుకున్నాడు.

►ALSO READ | SRK Life Lessons: జీవితంలో గెలవాలంటే షారుఖ్ చెప్పిన 5 సక్సెస్ సీక్రెట్స్ ఇవే

ఇదిలా ఉంటే.. అసలు ట్విస్ట్ ఫ్యామిలీ వీక్‌కు ముందే మొదలైంది. నేహా తల్లిదండ్రులు నేరుగా బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చారు. వారిని చూసి తొలుత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన నేహాకు కొద్దిసేపటికే షాక్ తగిలింది. షోలో కొనసాగకుండా ఇంటికి వచ్చేయాలని వారు భావోద్వేగంగా కోరారు. ఇతరులు గేమ్ ఆడుతుంటే నువ్వు మాత్రం భావోద్వేగాల్లో చిక్కుకుపోతున్నావని, నీ అమాయకత్వాన్ని ఇతరులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి సైతం నేహా తమను మర్చిపోయిందా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పరిణామంతో నేహా ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. తషి హిందువు కావడంతోనే ఆమె తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చనడుస్తోంది. అయితే దీనిపై స్పష్టమైన అధికారిక నిర్ధారణ లేదు. అసలు తల్లిదండ్రుల ఆందోళనకు కారణం ప్రేమనా? లేక షోలో నేహా ప్రవర్తనా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా నిజమైన భావోద్వేగమా, లేక రియాలిటీ షోలో మరో సంచలన ఎపిసోడ్‌గా మిగిలిపోతుందా? అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది.