మా టార్గెట్ తెలంగాణే...కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకిలించాలి: అమిత్ షా

మా టార్గెట్ తెలంగాణే...కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకిలించాలి: అమిత్ షా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.  కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకిలించి వేయాలని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసోం,బెంగాల్,హర్యానాలో గెలిచాం ..భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ విజయం సాధించబోతోందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఇకపై కాపాడలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

 తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇది రేవంత్ ట్యాక్స్ కాదని.. రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి వెళ్లే ట్యాక్స్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని విమర్శించారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ప్రధాని మోదీతో పోటీ పడగలదా? అని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కథ ముగిసిపోతోందని, తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

చొరబాటుదారులను తరిమికొడతాం

చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అండ్ కంపెనీ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ఒక్కో చొరబాటుదారుడిని వెతికి వెతికి దేశం నుంచి తరిమికొడతామని వ్యాఖ్యానించారు.

13 కోట్ల ఓట్లు తొలగించారన్న ప్రచారం పచ్చి అబద్ధమని అమిత్ షా పేర్కొన్నారు. డబుల్ ఓట్లు ఉన్నవారి పేర్లను మాత్రమే తొలగించామని చెప్పారు. దేశంలో మూడు కోట్ల మంది చనిపోయారని, మరణించిన వారి ఓట్లను తొలగించాలా? వద్దా? నకిలీ ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. నకిలీ ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.