హైదరాబాద్: రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు. కనీసం మాక్ పార్లమెంట్లోనైనా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాల్సిందని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, హిమాచల్ ప్రదేశ్, కేరళలో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందని ప్రశ్నించారు. బెంగాల్లో మమతా బెనర్జీ పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే మోదీ గెలిచారని రాహుల్ గాంధీ అంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీ విజయం సాధించినప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారికి నమస్కారాలు తెలిపిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు.
కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారానికి దూరం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇది రేవంత్ ట్యాక్స్ కాదని.. రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి వెళ్లే ట్యాక్స్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో వెంటిలేటర్‌పై ఉందని, ఆ పార్టీని రాహుల్ గాంధీ కాపాడలేరని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ప్రధాని మోదీతో పోటీ పడగలదా? అని ప్రశ్నించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కథ ముగిసిపోతోందని, తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
చొరబాటుదారులను వెతికి వెతికి తరిమికొడతాం
చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అండ్ కంపెనీ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ఒక్కో చొరబాటుదారుడిని వెతికి వెతికి దేశం నుంచి తరిమికొడతామని వ్యాఖ్యానించారు.13 కోట్ల ఓట్లు తొలగించారన్న ప్రచారం పచ్చి అబద్ధమని అమిత్ షా పేర్కొన్నారు. డబుల్ ఓట్లు ఉన్నవారి పేర్లను మాత్రమే తొలగించామని చెప్పారు. దేశంలో మూడు కోట్ల మంది చనిపోయారని, మరణించిన వారి ఓట్లను తొలగించాలా? వద్దా? నకిలీ ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. నకిలీ ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.
మోదీ పాలనపై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయ్యాయని అమిత్ షా గుర్తుచేశారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఘటన కూడా జరగలేదన్నారు.అసోం, బెంగాల్, హర్యానాలో బీజేపీ విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం
తెలంగాణలో కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకిలించి వేయాలని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ విజయం సాధించబోతోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఇకపై కాపాడలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
