స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలకమైన సూచనలు, సిఫార్సులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లపై విధించే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG) పన్నును పూర్తిగా ఎత్తివేయాలని సెబీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. రానున్న కేంద్ర బడ్జెట్‌కు ముందు ఈ ప్రతిపాదనలు తెరపైకి రావడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు రూ. 3లక్షల కోట్ల విలువైన భారతీయ లిస్టెడ్ షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు. దీనివల్ల మన దేశ కరెన్సీ రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం భారత్‌లో ఉన్న పన్ను విధానమేనని ఫారెన్ ఇన్వెస్టర్లు సెబీతో జరిగిన సమావేశాల్లో స్పష్టం చేశారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సెబీ.. విదేశీ పెట్టుబడులను మళ్లీ ఆకర్షించేందుకు ఈ సాహసోపేత ప్రతిపాదనను సిద్ధం చేసింది.
కేవలం విదేశీ ఇన్వెస్టర్లకే కాకుండా.. దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కూడా సెబీ పన్ను ఊరటను ప్రస్తావించింది. ఇన్వెస్టర్లు తమ పాత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను అమ్మేసి.. ఆ మొత్తాన్ని కొత్త పథకాల్లో తిరిగి పెట్టుబడి చేసేటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మోడీ ప్రభుత్వానికి సూచించింది సెబీ. ప్రస్తుతం సెక్యూరిటీలపై ఒక సంవత్సరానికి పైగా పెట్టుబడి ఉంటే 12.5 శాతం ఎల్టీసీజీ పన్ను, స్వల్పకాలిక లాభాలపై 20 శాతం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సెబీ చేసిన ఈ సిఫార్సులు కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని, ఫైనల్ నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్ స్పందిస్తూ.. ప్రభుత్వం కనుక ఈ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, అది భారతీయ మార్కెట్లకు చాలా పాజిటివ్ అవుతుందని.. విదేశీ నిధులు దేశంలోకి తరలివచ్చేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
