సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పక్కాగా డబుల్ అవ్వుద్ది.. బ్రోకరేజ్ సంచలన అంచనా!

సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పక్కాగా డబుల్ అవ్వుద్ది.. బ్రోకరేజ్ సంచలన అంచనా!

విండ్ ఎనర్జీ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లపై బ్రోకరేజ్ సంస్థ 'సెంట్రమ్' సానుకూల అంచనాలు వెలువరించింది. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే సుజ్లాన్ షేరు రాబోయే కాలంలో ఏకంగా 100 శాతం మేర వృద్ధి చెంది రూ.68 స్థాయికి చేరుకోవచ్చని సెంట్రమ్ అంచనా వేసింది. ఇటీవల వెలువడిన కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు తగినట్లుగానే ఉన్నప్పటికీ.. నిర్వహణ మార్జిన్లు కొద్దిగా తగ్గడంతో బ్రోకరేజ్ సంస్థ టార్గెట్ ధరను కొద్దిగా సవరించింది. అయినప్పటికీ స్టాక్ పై తమ Buy రేటింగ్ ను మాత్రం అలాగే కొనసాగించింది.

సుజ్లాన్ ఆర్థిక పనితీరు బలంగా దూసుకుపోతోంది. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.4వేల 880 కోట్లకు చేరుకుంది. విండ్ టర్బైన్ల సేల్స్, వాటి కమీషనింగ్ ప్రక్రియ ఊపందుకోవడం ఇందుకు ప్రధాన కారణం. కంపెనీ చేతిలో ప్రస్తుతం 6.01 గిగావాట్ల భారీ ఆర్డర్ బుక్ ఉంది. ఇది రాబోయే 18 నెలల పాటు కంపెనీకి రెవెన్యూ ఇవ్వనుంది. అంతేకాకుండా సుజ్లాన్ 2.0 వ్యూహాలు, టర్బైన్ల డెలివరీలు భారీగా పెరగడం వంటి అంశాలు మధ్యకాలిక వృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని సెంట్రమ్ పేర్కొంది.

నిర్వహణ ఖర్చులు, కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల వల్ల EBITDA మార్జిన్ స్వల్పంగా 15 శాతానికి తగ్గినప్పటికీ, భవిష్యత్తులో ఆపరేటింగ్ లెవరేజ్ ద్వారా ఇది మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ అర్ధభాగంలో డెలివరీలు మరింత పుంజుకుంటాయని మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేసింది. కంపెనీ వద్ద రూ. 2వేల 048 కోట్ల నికర క్యాష్ రిజర్వ్స్ ఉండటం కంపెనీ బలమైన ఆర్థిక పరిస్థితికి నిదర్శనం.

ఇతర బ్రోకరేజ్ సంస్థలు సుజ్లాన్ టార్గెట్లను తగ్గించినప్పటికీ.. సెంట్రమ్ మాత్రం దీర్ఘకాలిక వృద్ధిపై పూర్తి నమ్మకంతో ఉంది. FY26-FY29 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం, ఈబీఐటీడీఏ, పన్నుకు ముందు లాభం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తాయని అంచనా వేసింది. మొత్తానికి తాజా కరెక్షన్‌తో రూ. 35-36 మధ్య ట్రేడవుతున్న సుజ్లాన్ షేరు లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులను అందించి, సెంట్రమ్ అంచనా ప్రకారం డబుల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే ట్రేడింగ్ నిర్ణయాలకు వీ6 ఉద్యోగులు, యాజమాన్యం ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యులు కారు.