క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే రోజువారీ ఖర్చులు చాలా సులువుగా నడిచిపోతాయి. షాపింగ్, కిరాణా సామాన్లు, బిల్లుల చెల్లింపులు ఇలా అన్నిటికీ అండగా ఉంటుంది. కానీ దీన్ని జాగ్రత్తగా వాడకపోతే మాత్రం పెద్ద చిక్కుల్లో పడాల్సి వస్తుంది. చాలామంది ప్రతి నెలా వచ్చే బిల్లులో మినిమం డ్యూ మాత్రమే కట్టి మిగతాది వచ్చే నెల కట్టేద్దాంలే అని అలాగే వదిలేస్తుంటారు. ఆ సమయంలో అది ఎంతో ఉపశమనంలా అనిపించినా.. లాంగ్‌టర్మ్‌లో అదే మన కొంప ముంచుతుంది.
క్రెడిట్ కార్డుల మీద వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక నెలలో రూ.50వేలు బిల్లు చేసి.. దాన్ని అసలు చెల్లించకుండా అలాగే వదిలేశారు అనుకోండి. సాధారణంగా ఇలాంటి వాటిపై బ్యాంకులు నెలకు సుమారు 3.5%.. సంవత్సరానికి 42% వడ్డీ వేస్తాయి. ఈ వడ్డీ ప్రతి నెలా అసలుకు కలపటం వల్ల అది పెరుగుతూ పోతుంది.
మీరు ఒక రూ.50వేలు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకుండా ఏడాదిపాటు అలాగే వదిలేస్తే లెక్క ఎలా మారుతుందో చూడండి:
* క్రెడిట్ కార్డులో వాడిన అసలు బిల్లు: రూ. 50వేలు
* 12 నెలల తర్వాత వడ్డీతో కలిపి మొత్తం: రూ. 75వేల 553 అవుతుంది దీనికి జీఎస్టీ అదనం.
* కేవలం వడ్డీ రూపంలోనే పడిన భారం మొత్తం: రూ.25వేల 553
* వడ్డీపై 18% జీఎస్టీ: రూ. 4వేల 600
* అంటే ఏడాది చివరికి మీరు చెల్లించాల్సిన మొత్తం: రూ.80వేల 153
చూశారా.. కేవలం 50 వేల రూపాయల అప్పు, ఏడాది తిరిగేసరికి 80 వేలకు పైగా అయిపోయింది. అంటే అదనంగా మనం కట్టాల్సిన మొత్తం అసలులో సగం కంటే ఎక్కువన్నమాట. దీనికి తోడు లేట్ ఫీజులు, పెనాల్టీలు అదనం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనం మినిమం డ్యూ కట్టేస్తున్నాం కదా అని ధీమాగా ఉండిపోవడమే కారణం. పైగా ఇలాంటి సమయంలో కొత్త కొనుగోళ్లు చేస్తే వాటికి కూడా ఎలాంటి వడ్డీ లేని గడువు లభించదు. కొత్తగా వాడే లిమిట్ పై కూడా వెంటనే వడ్డీ పడటం స్టార్ట్ అవుతుంది వాడిన రోజు నుంచే.
►ALSO READ | సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. FDలపై 8.60% వరకు వడ్డీ.. ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే!
అందుకే క్రెడిట్ కార్డు అనేది కేవలం సులభంగా డబ్బు చెల్లించడానికి ఒక సాధనం మాత్రమే కానీ.. అది మన ఆదాయాన్ని మించి ఖర్చు చేయడానికి ఇచ్చే ఉచిత బహుమతి కాదు. అత్యవసర ఖర్చులకు మాత్రమే దీన్ని వాడాలి. ప్రతి నెలా బిల్లు రాగానే పూర్తి మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ప్రశాంతంగా ఉండగలం. వాస్తవానికి క్రెడిట్ కార్డులను సరిగ్గా వాడుకుంటో బోలెడన్ని రివార్డులు, డిస్కౌంట్లతో డబ్బును ఆదా చేసుకోవచ్చు అయితే ఇందుకు సమయానికి పూర్తిగా బిల్లు చెల్లించే సామర్థ్యం ఉండాలి.
