హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపాల పండుగగా పేరొందిన దీపావళి కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
2026లో దీపావళి పండుగను నవంబర్ 8, ఆదివారం రోజున రానుంది. అయితే దీపావళి వేడుకలు ఒక్కరోజుతో ముగియవు. ధన్తేరస్తో ప్రారంభమై భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పాటు వివిధ పండుగలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది.
మరి 2026లో ధన్తేరస్ ఎప్పుడు ? చోటి దీపావళి ఏ రోజున వస్తుంది ? లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి ? గోవర్ధన పూజ, భాయ్ దూజ్ తేదీలు ఎప్పుడు ? దీపావళి రోజున లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఎప్పుడు ? ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందామా....
ఈ ఐదు రోజుల పండుగలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ప్రజలు పూజలు నిర్వహించి పండుగను జరుపుకుంటారు.
మొదటి రోజు: నవంబర్ 6న ధన్తేరస్
దీపావళి వేడుకలు ధన్తేరస్తో ప్రారంభమవుతాయి. 2026లో నవంబర్ 6న ధన్తేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజును ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ధన్తేరస్ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడిని, లక్ష్మీదేవిని భక్తులు పూజిస్తారు. వారి ఇళ్లలో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తారు.
ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. చాలామంది వారి స్థోమతకు అనుగుణంగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లేదా కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కూడా ఈ రోజును ప్రత్యేకంగా భావిస్తారు.
రెండో రోజు: నవంబర్ 7న చోటి దీపావళి
దీపావళి వేడుకల్లో రెండో రోజు చోటి దీపావళి. దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు. 2026లో నవంబర్ 7న ఈ పండుగను జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. అతడి దౌర్జన్యాలను అరికట్టేందుకు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు. ఈ విజయానికి గుర్తుగా నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలంటుకుని స్నానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇళ్లను శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహిస్తారు.
మూడో రోజు: నవంబర్ 8న దీపావళి.. లక్ష్మీ పూజ
దీపావళి పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు నవంబర్ 8. ఈ రోజున దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకుని, రావణుడిని సంహరించిన తర్వాత సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన రాకను పురస్కరించుకుని అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అప్పటి నుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారని నమ్మకం.
ఈ రోజున ప్రజలు వారి ఇళ్లను అందంగా అలంకరిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగిస్తారు. సాయంత్రం లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని పూజిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేసి, మిఠాయిలు పంచుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.
దీపావళి 2026.. లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
దీపావళి రోజున లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున సాయంత్రం శుభ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
పంచాంగం ప్రకారం 2026 దీపావళికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమావాస్య తిథి ప్రారంభం: నవంబర్ 8న ఉదయం 11:28 గంటలకు.
అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 9న మధ్యాహ్నం 12:32 గంటలకు.
ప్రదోష కాలం: సాయంత్రం 5:31 నుంచి రాత్రి 8:09 గంటల వరకు.
వృషభ కాలం: సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 గంటల వరకు.
లక్ష్మీ పూజ ముహూర్తం: సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 గంటల వరకు.
అంటే దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకోవడానికి సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 గంటల వరకు శుభ సమయంగా పేర్కొన్నారు. ఈ సమయంలో భక్తులు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజించవచ్చు.
నాలుగో రోజు: నవంబర్ 10న గోవర్ధన పూజ
దీపావళి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ గోవర్ధన పూజ. దీనినే అన్నకూట్ అని కూడా పిలుస్తారు. 2026లో నవంబర్ 10న ఈ పండుగను జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గోకుల ప్రజలను భారీ వర్షాల నుంచి కాపాడాడు. ఈ సంఘటనకు గుర్తుగా గోవర్ధన పూజను నిర్వహిస్తారు.
ఈ రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతికి, పశుసంపదకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఐదో రోజు: నవంబర్ 11న భాయ్ దూజ్
దీపావళి ఐదు రోజుల వేడుకల్లో చివరి రోజు భాయ్ దూజ్. 2026లో నవంబర్ 11న ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని భాయ్ బీజ్ అని కూడా పిలుస్తారు.
ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు నుదుటిపై తిలకం పెట్టి, హారతి ఇచ్చి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు.
సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు అందించి వారి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడుపుతారు. ఇలా భాయ్ దూజ్తో దీపావళి ఐదు రోజుల వేడుకలు ముగుస్తాయి.
దీపావళి పూజకు ముందుగా ఏం చేయాలి?
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేయాలనుకునేవారు కొన్ని సంప్రదాయాలను పాటిస్తారు.
ముందుగా ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గులు వేయాలి.
పూజ గదిని పూలతో, దీపాలతో అలంకరించుకోవాలి.
లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు లేదా చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవాలి.
పండ్లు, పూలు, స్వీట్లు, నైవేద్య పదార్థాలను సిద్ధం చేసుకోవాలి.
నిర్ణయించిన శుభ ముహూర్తంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించాలి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు వెలిగించాలి.
మొత్తంగా చూస్తే 2026 దీపావళి వేడుకలు నవంబర్ 6న ధన్తేరస్తో ప్రారంభమై నవంబర్ 11న భాయ్ దూజ్తో ముగుస్తాయి. ఈ ఐదు రోజుల పండుగలో సంపద, ఆరోగ్యం, భక్తి, కుటుంబ అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ముఖ్యంగా నవంబర్ 8న వచ్చే దీపావళి రోజున లక్ష్మీ పూజకు సాయంత్రం 5:54 నుంచి రాత్రి 7:50 గంటల వరకు శుభ ముహూర్తం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రాంతాలను బట్టి పంచాంగ వివరాలు, పూజా సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి పూజ నిర్వహించే ముందు స్థానిక పంచాంగం లేదా పురోహితుల సూచనలు తీసుకోవడం మంచిది.
గమనిక: పై తేదీలు, ముహూర్తాలు అందించిన పంచాంగ వివరాల ఆధారంగా రూపొందించబడ్డాయి. మీ ప్రాంతంలోని స్థానిక పంచాంగాన్ని ఒకసారి పరిశీలించండి.
