వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు వచ్చాయ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలకలం.. మేనేజర్‌కు చుక్కలు!

వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు వచ్చాయ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలకలం.. మేనేజర్‌కు చుక్కలు!

ఎయిర్ పోర్టులో  ప్రయాణికులు ఏదైనా తినాలనుకుంటే అక్కడి రెస్టారెంట్లలో ఫుడ్  ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా శాకాహారం తినేవారు వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు. అయితే వెజ్ అని ఆర్డర్ చేసిన ఆహారంలోనే చికెన్ ముక్కలు కనిపిస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇలాంటి షాకింగ్ అనుభవమే ఓ కుటుంబానికి ఎదురైంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కుటుంబానికి అందులో చికెన్ ముక్కలు కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేనేజర్, చెఫ్‌ను పిలిచి  జరిగిన పొరపాటుపై వివరణ ఇవ్వాలని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ? ఆ కుటుంబం ఎందుకు అంతగా ఆగ్రహం వ్యక్తం చేసింది ? చూద్దామా...

వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్కలు 
ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1లో చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టులో  16, 17 గేట్ల సమీపంలో ఉన్న 'టేస్ట్ ఆఫ్ ఇండియా' అనే రెస్టారెంట్‌కు ఓ కుటుంబం వెళ్లింది. అక్కడ వారు వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. వారు మంచి శాకాహార భోజనం లభించిందని భావించి కుటుంబ సభ్యులంతా బిర్యానీ తినడం ప్రారంభించారు. అయితే కొంతసేపటి తర్వాత బిర్యానీలో చిన్న చిన్న చికెన్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు.

వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మేము ప్రత్యేకంగా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినప్పటికీ, అందులో మాంసాహారం ఎలా వచ్చిందని రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు.

ప్లేట్‌లో చికెన్ ముక్కలు చూపిస్తూ ఆగ్రహం!
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పీయూష్ అగర్వాల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కుటుంబానికి చెందిన ఓ మహిళ దాదాపు ఖాళీ అయిన బిర్యానీ ప్లేట్‌ను చూపిస్తూ అందులో ఉన్న చికెన్ ముక్కలను చూపించారు. అగర్వాల్ కూడా ఆహారాన్ని వీడియో తీస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశామని, కానీ అందులో చికెన్ ముక్కలు వచ్చాయని వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయం మా కుటుంబాన్ని తీవ్రంగా కలవరపరిచిందని తెలిపారు. ముఖ్యంగా మా కుటుంబం కఠినమైన శాకాహారాన్ని పాటిస్తుందని, ఆహారంలో చికెన్ ఉన్న విషయం గుర్తించేలోపే పిల్లలు కూడా తిన్నారని ఆయన ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆవేదనకు గురయ్యారు.

మేనేజర్‌ను పిలవాలని పట్టుబట్టిన కుటుంబ సభ్యులు!
వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు రెస్టారెంట్ ఉద్యోగులను నిలదీశారు. అసలు వెజిటేరియన్ ఆర్డర్‌లో చికెన్ ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో  ఉద్యోగులు సమాధానం చెప్పలేకపోవడంతో వెంటనే మేనేజర్‌ను పిలవాలని డిమాండ్ చేశారు. మాకు  జరిగిన పొరపాటుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయ సిబ్బంది కూడా రెస్టారెంట్ ఉద్యోగులను ప్రశ్నించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.

మేనేజర్, చెఫ్ వచ్చినా తగ్గని ఆగ్రహం!
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చివరకు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్ అక్కడికి వచ్చారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న కుటుంబ సభ్యులు వారిని కూడా నిలదీశారు. వెజ్ బిర్యానీగా ఆర్డర్ చేసిన ఆహారంలో చికెన్ ముక్కలు ఎలా వచ్చాయని, వంటగదిలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఇలాంటి పొరపాట్లు అసలు ఎలా జరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగర్వాల్ చేసిన ఆరోపణల ప్రకారం, బిర్యానీలో చికెన్ ఉన్న విషయాన్ని మేనేజర్, చెఫ్ అంగీకరించారు. ఈ ఆర్డర్‌కు సంబంధించిన బిల్లు, ఇతర ఆధారాలను కూడా కుటుంబం భద్రపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు, రెస్టారెంట్ అధికారిక వివరణ తెలియాల్సి ఉంది.

సాధారణంగా వెజ్, నాన్‌వెజ్ ఆహారాలను వేర్వేరుగా తయారు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా శాకాహారం మాత్రమే తీసుకునే వారికి ఆహారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే రెస్టారెంట్లు ఆర్డర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.