హైదరాబాద్: నగరంలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా సేవలను ప్రారంభించింది. తొలి విడతలో నగరంలోని 11 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నుంచి 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్తాపూర్ ఎస్టీపీ నుంచి అత్యధికంగా ఐదు ట్యాంకర్ల ద్వారా గ్రీన్ వాటర్ సరఫరా చేయనున్నారు. అంబర్పేట్ ఎస్టీపీ నుంచి మూడు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. మీరాలం, నాగోల్, ముల్కత్వ చెరువు, నల్లచెరువు, హుస్సేన్ సాగర్, కోకాపేట్, గోపన్‌పల్లి, లింగంకుంట, సరూర్‌నగర్ ఎస్టీపీల నుంచి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ట్యాంకర్లపై ప్రత్యేక గుర్తింపు.. నాణ్యతపై పర్యవేక్షణ
గ్రీన్ వాటర్ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్‌కు ఆకుపచ్చ రంగు వేయడంతో పాటు ప్రత్యేక బ్రాండింగ్ తప్పనిసరి చేశారు. ట్యాంకర్లపై 'STP TREATED WATER – NOT FOR DRINKING' అనే హెచ్చరికను స్పష్టంగా ప్రదర్శించనున్నారు. ప్రతి ఎస్టీపీకి ప్రత్యేక అధికారులను నియమించి, నీటి నాణ్యత, సరఫరా తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ALSO READ : వానమ్మ ఎందుకు రాలేదు..అమరచింతను మర్చిపోయిందా..
గ్రీన్ వాటర్ ట్యాంకర్ అంటే ఏమిటి?
గ్రీన్ వాటర్ ట్యాంకర్ అంటే మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో (STP – Sewage Treatment Plant) శుద్ధి చేసిన నీటిని తరలించే ప్రత్యేక ట్యాంకర్.నగరంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేసి, తిరిగి ఉపయోగించుకునే స్థాయికి తీసుకొస్తారు. ఈ నీటినే గ్రీన్ వాటర్ అంటారు.
ఈ నీటిని ఎక్కడ ఉపయోగించవచ్చు?
- పార్కుల్లో మొక్కలు, చెట్లకు నీరు పెట్టేందుకు.
- గార్డెన్లు, గ్రీనరీ నిర్వహణకు.
- భవన నిర్మాణ పనులకు.
- పరిశ్రమల్లో అవసరమైన చోట.
- ఇతర తాగునీరు అవసరం లేని పనులకు.
ఎందుకు గ్రీన్ వాటర్ ట్యాంకర్లు?
తాగునీటిని పార్కులు, నిర్మాణ పనులు వంటి అవసరాలకు వృథా చేయకుండా, ఆ పనులకు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించడం వీటి ప్రధాన ఉద్దేశం. తద్వారా తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుంది
