వానమ్మ ఎందుకు రాలేదు..అమరచింతను మర్చిపోయిందా.. వానలు పడకపోతే ఏం చేయాలి

వానమ్మ ఎందుకు రాలేదు..అమరచింతను మర్చిపోయిందా.. వానలు పడకపోతే ఏం చేయాలి

​అది తెలంగాణలోని అమరచింత గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, ఊరి చివర పెద్ద చెరువు, చెరువు కింద మెట్ట పొలాలు. వానాకాలం వస్తే చాలు.. ఆ ఊరంతా సందడే సందడి. మబ్బులు కమ్ముకుంటే పిల్లల కళ్లల్లో ఆనందం. 

తొలి చినుకు పడితే మట్టివాసనతో ఊరంతా పరవశం. రైతుల ముఖాల్లో కొత్త ఆశలు. ​కానీ ఆ ఏడాది మాత్రం పరిస్థితి తారుమారైంది. వానాకాలం వచ్చి రోజులు గడుస్తున్నా ఆకాశంలో మబ్బుల జాడే లేదు. ఎండలు మండిపోతున్నాయి. చెరువులో నీళ్లు అడుగంటాయి. బావుల్లో నీటిమట్టం పడిపోయింది. పొలాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తక రైతన్నలు దిగులు పడుతున్నారు.

​ఆ ఊరిలో ఆరో తరగతి చదివే పిల్లగాడు చిన్ను.. ఒకరోజు బడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత పొలంవైపు చూస్తూ కూర్చున్న తన తాత దగ్గరికి వెళ్లాడు.​“తాతా.. ఈసారి వానమ్మ మన అమరచింతను మర్చిపోయిందా?” అని అమాయకంగా అడిగాడు.

​తాత నవ్వి, “వానమ్మ ఎవ్వరినీ మర్చిపోదు బిడ్డా! ప్రకృతిలో కొన్ని మార్పులు జరిగితే వానలు ఆలస్యమవుతాయి” అన్నాడు.​చిన్ను “ఏం మార్పులు తాతా?” అని అడిగాడు. ​తాత ​“పసిఫిక్ మహాసముద్రం అనే అతిపెద్ద సముద్రం ఉంది. దాని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్రపు నీళ్లు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కినప్పుడు ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నే ‘ఎల్‌నినో’ అంటారు.”

​చిన్ను ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేస్తూ, “సముద్రంలో నీళ్లు వేడెక్కితే మన ఊర్లో వానలు ఎందుకు తగ్గుతాయి తాతా?” అని అడిగాడు.​తాత వివరిస్తూ.. “అదే ప్రకృతి వైచిత్రి! సముద్రపు ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తే గాలుల కదలికలు, మేఘాలు ఏర్పడే తీరు మారిపోతాయి. దాని ప్రభావం వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాల వాతావరణంపై కూడా పడుతుంది. 

మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలనూ ఇది బలహీనపరుస్తుంది. అందుకే కొన్నేళ్లలో వర్షపాతం బాగా తగ్గుతుంది. అలాగని అదొక్కటే కారణం కాదు. సముద్రాల ఉష్ణోగ్రతలు, వాయుగుండాలు, పవనాల వేగం, ఇతర పర్యావరణ మార్పులు.. ఇవన్నీ కలిసే వర్షపాతాన్ని నిర్ణయిస్తాయి.”​చిన్ను, “అయితే వాన ఎప్పుడు పడుతుందో మనం కచ్చితంగా చెప్పలేమా?” అని ప్రశ్నించాడు.

​“వాతావరణ శాస్త్రవేత్తలు ఉపగ్రహాలు, రాడార్ల ద్వారా పరిశీలించి ముందస్తు అంచనాలు వేస్తారు. కానీ ప్రకృతిని నూటికి నూరు శాతం మన నియంత్రణలో ఉంచుకోలేం కదా” అన్నాడు తాత. 
​“వానలు సరిగా పడకపోతే ఏం చేయాలి తాతా?”

​“నీటిని బొట్టు కూడా వృథా చేయకూడదు. వాన పడినప్పుడు ప్రతి చుక్కనూ ఒడిసి పట్టుకోవాలి. ఇంటి పైకప్పులపై పడే వర్షపునీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపాలి. చెరువులు, కుంటలను పూడికతీసి కాపాడుకోవాలి. ” చిన్ను కళ్లల్లో కొత్త వెలుగు మెరిసింది.​మరుసటి రోజు బడిలో తన సైన్స్ ఉపాధ్యాయుడికి తాత చెప్పిన విషయాలన్నీ వివరించాడు. ​ఉపాధ్యాయుడు తరగతిలోని పిల్లలందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు 

​“నీటి విలువను గుర్తించడం చాలా ముఖ్యం. మన చేతుల్లో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం నేర్చుకోవాలి.​ మీరంతా ఇలా ప్రతిజ్ఞ చేయండి.. ​“నీటి చుక్కను వృథా చేయం.. వాననీటిని ఒడిసి పడతాం.. చెట్లను నాటి పెంచుతాం.. ఊరి చెరువులను కాపాడుతాం!” అన్నారు టీచర్. అంతా కలిసి ప్రతిజ్ఞచేశారు. 

​​కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో నల్లని కారుమబ్బులు కమ్ముకున్నాయి. చల్లని చినుకులు నేలను ముద్దాడాయి. చిన్ను దోసిలి చాచి ఆ తొలి చినుకులను అందుకుంటూ అన్నాడు.

- ఉప్పరి తిరుమలేష్-

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.