ఏపీ గజగజ వణుకుతుంది. నిన్నటికి నిన్న ఆర్నబ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త. బంగాళాఖాతంలో మరో తుఫాన్. అవును.. భారత వాతావరణ శాఖ కన్ఫామ్ చేసింది. రాబోయే 24 గంటల్లో తుఫాన్ ఏర్పడుతుంది అని.. మరి ఇది ఎక్కడ తీరం దాటుతుంది అంటే.. ఆంధ్రప్రదేశ్లోనే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలతో.. 2026, నవంబర్ 2వ తేదీ సాయంత్రం ఇది ఏపీలో తీరం దాటనుంది. మరోసారి విధ్వంసం సృష్టించనుంది. లేటెస్ట్ గా ఏర్పడిన తుఫాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 6 గంటల్లో వాయుగుండంగా బలపడి ఆ తర్వాతి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని శనివారం (అక్టోబర్ 31) ఐఎండీ తెలిపింది.
తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 2 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఏపీలోనే ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో నవంబర్ 2, 3, 4 తేదీల్లో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, ఒడిశాలో తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
వాతావరణ మార్పులతో సముద్రం అలజడిగా ఉందని.. నవంబర్ 4 వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అర్నాబ్ తుఫాన్ తో ఏపీ అతలాకుతలం కాగా తాజాగా మరో తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
