తమ కూతురు లండన్ లో ఉంది. ఎంబీఏ చేస్తోంది. ఒకటి రెండేళ్లలో కోర్స్ పూర్తి చేసి అక్కడే మంచి జాబ్ చేస్తుంది. మంచి శాలరీతో.. నెల నెలకు డబ్బు పంపిస్తుంది.. ఆర్థికంగా కుటుంబానికి తోడుంటుంది.. అని కలలుగన్న ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. లండన్ లో ఉన్న కూతురు శవం రూపంలో ఒక ఫ్లాట్ లో కనిపించడంతో ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇండియా ఎప్పుడు వచ్చింది.. అసలు లండన్ వెళ్లిందా లేదా.. అనే డౌట్స్ బంధువుల్లో మొదలయ్యాయి. ఈ మిస్టరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని చత్రపతి సంభాజినగర్‌కు చెందిన ముగ్ధా దేశ్‌ముఖ్ (34) ఎంబీఏ చదవడానికి 2025 జూలైలో యూకే వెళ్లారు. లండన్‌లో ఒంటరిగా ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆగస్టు నెలలో కుటుంబానికి తెలియకుండా భారత్‌కు తిరిగొచ్చి, పింప్రి చించ్వాడ్ పరిధిలోని గహుంజేలోని లోధా బెల్మాండో కాంప్లెక్స్‌లో అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆ ఫ్లాట్‌ను ఏప్రిల్‌లోనే అద్దెకు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
అక్టోబర్ 23న తల్లితో మాట్లాడిన తర్వాత ఆమె ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అయింది. కుటుంబం సంప్రదించడానికి ప్రయత్నించినా సమాధానం రాలేదు. లండన్‌లోని స్నేహితురాలు స్థానిక పోలీసులను సంప్రదించగా, ఆమె ఆగస్టు చివరిలోనే యూకే విడిచిపెట్టినట్లు తెలిసింది. కుటుంబం ఇండియన్ హైకమిషన్ సహాయం కోరింది. తండ్రి ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు పరిశీలించగా, అక్టోబర్ 8 నుంచి 25 మధ్య స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ఫుడ్ డెలివరీ, బుక్‌మైషో, మేక్‌మైట్రిప్ వంటి ఆన్‌లైన్ సర్వీసులకు చెల్లింపులు కనిపించాయి. వాటిలో కొన్ని చత్రపతి సంభాజినగర్ ఊస్మాన్‌పురా ప్రాంతం నుంచి జరిగినట్లు కనిపించడంతో ఆమె భారత్‌లోనే ఉన్నట్లు అనుమానం వచ్చింది.
చత్రపతి సంభాజినగర్ పోలీసులు జొమాటో ఆర్డర్ హిస్టరీ ఆధారంగా లోధా బెల్మాండోలోని ఫ్లాట్‌ను గుర్తించారు. షిర్‌గావ్ పోలీస్ స్టేషన్ జట్టు అక్కడికి వెళ్లి, లాక్ స్మిత్ సాయంతో తలుపు తెరిచి చూస్తే లోపల నుంచి లాక్ అయిన ఫ్లాట్‌లో ముగ్ధా మృతదేహం కనిపించింది. శరీరంపై బయటకు కనిపించే గాయాలు లేవని పోలీసులు చెప్పారు. పోస్ట్‌మార్టం కోసం విస్సెరా సేకరించారు. చనిపోవడం వెనుక కారణం తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది.
ఆమె పూణేలో ఉంటూ ఆన్‌లైన్‌లో ఎంబీఏ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నట్లు సమాచారం ఉంది. కుటుంబంతో వాట్సాప్ ద్వారా టచ్ లో ఉండేవారు. మిస్టరీగా మారిన ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఆమె మృతి వెనుక కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.
