బంజారాహిల్స్ ఎస్సైపై ఏసీబీ కేసు.. అరెస్టు చేయొద్దంటే రూ.10 లక్షలివ్వాలని డిమాండ్

బంజారాహిల్స్ ఎస్సైపై ఏసీబీ కేసు.. అరెస్టు చేయొద్దంటే రూ.10 లక్షలివ్వాలని డిమాండ్
  • ఇవ్వకపోవడంతో రిమాండ్​
  •  ఏసీబీకి బాధితుడి ఫిర్యాదు   
  •  ఎస్సై ని అరెస్ట్ ​చేసిన అధికారులు

జూబ్లీహిల్స్, వెలుగు : బంజారాహిల్స్ పీఎస్​ఎస్సై విజయ్‌‌పై ఏసీబీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతోపాటు, పాత కేసుల విచారణ పేరుతో మరో రూ.2 లక్షలు అడిగినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ ఈ చర్యలు తీసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం.. ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డికి సంబంధించిన ప్లాట్ల విక్రయాల వ్యవహారంలో ఓ చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు రోసిరెడ్డిని ఎస్సై విజయ్ రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 

అంత మొత్తం చెల్లించలేనని రోసిరెడ్డి చెప్పడంతో రిమాండ్‌‌కు పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బయటకు వచ్చాక పాత కేసుల విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో రోసిరెడ్డి రూ.లక్ష తీసుకొస్తానని వెళ్లిపోగా....ఏసీబీని తీసుకుస్తాడేమోనని లీవ్​పెట్టి వెళ్లిపోయాడు. రోసిరెడ్డి నిజంగానే ఏసీబీని ఆశ్రయించడంతో వారు ఎస్​ఐని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ కు  తరలించిందని ఏసీబీ అధికారులు వెల్లడించింది.