ప్రతి మండలంలో కరువు కమిటీ.. చైర్మన్గా ఎంపీడీవో,  కన్వీనర్గా ఎంపీవో

ప్రతి మండలంలో కరువు కమిటీ.. చైర్మన్గా ఎంపీడీవో,  కన్వీనర్గా ఎంపీవో
  •     తాగునీరు, ఉపాధి, పశుగ్రాసంపై యాక్షన్ ప్లాన్
  •     కూలీలకు ఉపాధి, సకాలంలో వేతనాలకు చర్యలు
  •     35,959 చెరువుల కింద పశుగ్రాసం సాగు
  •     మహిళా సంఘాలకు గ్రాసం సాగు బాధ్యతలు 
  •     పశువుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు
  •     వారానికోసారి మీటింగ్.. కలెక్టర్‌‌కు రిపోర్ట్


హైదరాబాద్, వెలుగు:  ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఉపాధి కల్పనతోపాటు మూగజీవాలకు పశుగ్రాసం తదితర ఇబ్బందులు రాకుండా యాక్షన్​ ప్లాన్​ అమలు చేయనుంది.  ఇందులో భాగంగా ప్రతి మండలంలో మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ కింద ఈ చర్యలు చేపట్టనున్నట్లు సర్కారు స్పష్టంచేసింది.

35,959 చెరువుల పరిధిలో పశుగ్రాసం సాగు 

ఎల్ నినో నేపథ్యంలో మూగజీవాలకు మేత కొరత రాకుండా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,959 చిన్న నీటిపారుదల చెరువులను గుర్తించి, నీటి లభ్యత ఉన్న చోట కమ్యూనిటీ పశుగ్రాసం సాగు చేపట్టాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్​హెచ్​జీ), గ్రామ సంఘాల (వీఓ) ద్వారా సాగు బాధ్యతలు అప్పగించాలి. సొంత బోర్లు, నీటి వనరులు ఉన్న రైతులతోనూ వ్యక్తిగతంగా పశుగ్రాసం సాగు చేయించాలి. గ్రామాలు, ఆవాసాల్లో పశువుల కోసం కొత్తగా నీటి తొట్టెలను నిర్మించడంతో పాటు, పాతవాటికి వెంటనే మరమ్మతులు చేయించాలి.

తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను గుర్తించి మిషన్ భగీరథ ఆఫీసర్లతో సమన్వయం చేసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వాటర్ సెక్యూరిటీ కోసం చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్ల పూడికతీత, ఫామ్ పాండ్స్ , మ్యాజిక్ సోక్ పిట్స్, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, బోర్​వెల్ రీఛార్జ్ పనులను వేగవంతం చేయాలి.

జీవనోపాధి కల్పనలో భాగంగా పశువులు, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణం, పట్టు పరిశ్రమ, ఉద్యానవన పనులను మంజూరు చేయనున్నారు.  మండల కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీలు కనీసం వారానికి ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించాలని స్పష్టం చేసింది. ఉపాధి కల్పన, వాటర్ కన్జర్వేషన్, జలసిరి పనుల వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రతి వారం జిల్లా కలెక్టర్‌కు పంపించడంతోపాటు గ్రామ పంచాయతీ ప్రణాళికలను జీపీ సాప్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. అన్ని మండలాల్లో కమిటీల ఏర్పాటు, ఎల్ నినో నివారణ చర్యల సమర్థవంతమైన అమలు, కమిటీల పనితీరుపై క్రమం తప్పకుండా సమీక్షించే బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.

ఎంపీడీవో అధ్యక్షతన కమిటీ

మండల స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు  ఎంపీడీవో చైర్మన్‌గా, మండల పరిషత్ అధికారి (ఎంపీఓ)కన్వీనర్‌గా కమిటీలు ఏర్పాటు చేస్తారు. పంచాయతీరాజ్ ఏఈఈ, నీటిపారుదలశాఖ ఏఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఏఈఈ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ), పశువైద్యాధికారి, ఉద్యానవనశాఖ అధికారి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరాన్ని బట్టి ఇతర శాఖల అధికారులనూ ఇందులో భాగస్వామ్యం చేస్తారు. కాగా, గ్రామాల్లో కూలీలకు ఉపాధికి లోటు లేకుండా ఎప్పటికప్పుడు తగినన్ని పనులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేబర్ మొబిలైజేషన్ పెంచి, ఎక్కువ పని దినాలు కల్పించడం, చేసిన పనులకు సకాలంలో వేతనాలు అందేలా చూడడం తదితర అంశాలన్నీ మండల కమిటీ పర్యవేక్షించాలి. గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల లోపాలను గుర్తించి గ్రామసభల ద్వారా ప్రాధాన్య పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్​లో చేర్చాలని సర్కారు ఆదేశించింది.