గోవాలోని వాస్కో నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిలక్ మైదాన్ సమీపంలోని కార్ యాక్సెసరీస్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెలరేగిన మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వాస్కోలోని సండే మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేలు దాజీ సల్కర్, సంకల్ప్ అమోంకర్‌లతో కలిసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు అగ్నిప్రమాదం గురించి తనకు సమాచారం అందిందని, వెంటనే ఘటనాస్థలికి వచ్చినట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు మొత్తం పరిపాలనా యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు.
వాస్కోలోని సండే మార్కెట్‌లో అనేక దుకాణాలు ఉండటంతో పాటు 150 మందికి పైగా వ్యాపారులు తమ స్టాళ్లను ఏర్పాటు చేసేవారని సీఎం వెల్లడించారు. అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన వ్యాపారులకు సాధ్యమైనంత మేర సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తుండగా, నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వ సహాయం అందించడంపై దృష్టి సారించారు.
