న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి(ఎమ్మెల్సీ) ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని ఎన్డీయే మిత్రపక్షాలు మొత్తం 28 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వారణాసితో సహా మొత్తం 5 స్థానాలను గెలుచుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కొహాలే, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభిజీత్ వంజరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. బిహార్‌లో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్ పార్టీ’ తన ఖాతా తెరిచింది.
ఈ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు తమ స్థానాలను కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 6 టీచర్, 5 గ్రాడ్యుయేట్స్ స్థానాలు, బిహార్‌లో 8, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 3 గ్రాడ్యుయేట్స్, 2 టీచర్స్ స్థానాలకు అక్టోబర్ 23న పోలింగ్ జరగగా.. మంగళవారం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
కర్నాటకలో క్లీన్ స్వీప్
కర్నాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చింది. ఇటీవల రాజకీయంగా వైరల్ అయిన " డీకే.. ఇట్స్ డన్, బ్రో " అనే క్యాచ్ ప్రేమ్‌ను వాడుతూ.. బీజేపీ రాష్ట్ర యూనిట్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది.
గత అక్టోబర్ 23న జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకోగా.. ఎన్డీయే కూటమిలోని జేడీఎస్ బెంగళూరు టీచర్స్ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి లాగేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలపై సీఎం శివకుమార్ స్పందిస్తూ.. ఓటర్ల తీర్పును తాము శిరసావహిస్తామని తెలిపారు.
విజయోత్సవ ర్యాలీలు వద్దన్న అఖిలేశ్..
ఫలితాలు వెలువడిన తర్వాత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. గెలుపొందిన పార్టీ అభ్యర్థులు ఎలాంటి విజయ యాత్రలు చేయవద్దని, సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు విజయాన్ని తెలియజేయాలని సూచించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, గొడవలు సృష్టించి దానిని ఎస్పీకి ఆపాదించేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చని ఆయన హెచ్చరించారు.
