రైళ్లలో రాత్రి పూట ఫోన్ చార్జింగ్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కరెంట్ నిలిపివేత

రైళ్లలో రాత్రి పూట ఫోన్ చార్జింగ్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కరెంట్ నిలిపివేత

న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట మొబైల్ చార్జింగ్ పాయింట్లను బంద్ చేయాలని అన్ని జోన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 

ముంబై లోకల్ రైలులో ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయి కోచ్ అంతటా దట్టమైన పొగ కమ్ముకున్న ఘటనపై తీవ్రంగా స్పందించిన బోర్డు.. చార్జింగ్ పాయింట్ల అంశంపై అక్టోబర్ 26న అన్ని జోన్లకు లేఖ రాసింది. నిర్ణీత వేళల్లో రైల్వే సిబ్బంది చార్జింగ్ పాయింట్లు ఆఫ్ చేయడంలో విఫలమయ్యారని, ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.

ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందికి ప్రత్యేక కౌన్సెలింగ్

రాత్రి పూట చార్జింగ్ పాయింట్ల నిలిపివేతపై జోనల్ రైల్వేలు ప్రత్యేక దృష్టి పెట్టాలని బోర్డు ఆదేశించింది. అన్ని కోచ్‌‌‌‌‌‌‌‌లలోనూ రాత్రి 6 గంటల పాటు చార్జింగ్ ఆపివేసేలా సిబ్బందికి తగిన శిక్షణ, కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు అధికారులు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లు ఆకస్మిక తనిఖీలు (సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చెక్స్) నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

పాత నిబంధనే.. ఇప్పుడు మరింత కఠినతరం

రైళ్లలో రాత్రి పూట చార్జింగ్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు కొత్తవేం కావు. వాస్తవానికి 2014 జూన్ 19నే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. బెంగళూరు- హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత.. రైల్వే సేఫ్టీ కమిషనర్ సిఫారసు మేరకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2021 మార్చిలోనూ దీనిపై మరోసారి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.