జ్ఞాను వెళ్లాల్సిందే.. ఇండియా బ్లాక్ ర్యాలీకి CJP మద్దతు

జ్ఞాను వెళ్లాల్సిందే.. ఇండియా బ్లాక్ ర్యాలీకి CJP మద్దతు

న్యూఢిల్లీ: సర్‎ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‎తో 2026, నవంబర్ 1 కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఢిల్లీలోని రామ్‎లీలా మైదాన్‎లో నిర్వహించనున్న మెగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను పర్యవేక్షించడానికి అవసరమైన విశ్వాసాన్ని సీఈసీ కోల్పోయారని, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను, స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించడానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పక రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని, అర్హులైన ఓటర్లను మినహాయించడంపై ఈ సందర్భంగా సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బుధవారం (అక్టోబర్ 28) ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ, ప్రభుత్వమే తన ఓటర్లను ఎన్నుకోకూడదని సీజేపీ పేర్కొంది.

ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి జ్ఞానేష్ కుమార్ రాజీనామా అవసరమని పునరుద్ఘాటించింది. డా. బి.ఆర్. అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి రాజ్యాంగ నిర్మాతలు ప్రతి పౌరుడికి కల్పించిన సమాన ఓటు హక్కును రక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని గుర్తు చేసింది. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి పౌరుడికి సమాన వాటా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధించగలదని.. పౌరులను దూరం పెట్టడం కాకుండా మరింత మందిని ప్రజాస్వామ్యంలోకి తీసుకురావడమే ప్రజాస్వామ్య సూత్రమని పేర్కొంది. 

►ALSO READ | మనీలాండరింగ్ కేసులో బెంగాల్ మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్‌ అరెస్ట్

సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలు పౌరుల సమాన రాజకీయ వాటాను పరిరక్షించాలని కోరింది. అర్హుడైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ఎన్నికల సంఘం బాధ్యత అని.. దానిని వినియోగించుకోవడానికి అడ్డంకులు సృష్టించడం సరికాదని పేర్కొంది. దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం పోరాడుతున్న సంస్థలకు మద్దతు ఇస్తామని సీజేపీ స్పష్టం చేసింది.