- 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 70 కిలోమీటర్ల వేగంతో గాలులు
- తుపాను ప్రభావంతో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాను తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు ఉన్న 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిస్తాయనే ఆశలు చిగురిస్తున్నా.. కోతకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందనే ఆందోళన నెలకొన్నది. తుఫాను ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత కూడా పెరుగుతున్నది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆర్నబ్ తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నదని ఐఎండీ తెలిపింది. బుధవారం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి
తుఫాను ప్రభావంతో తూర్పు, ఈశాన్య దిశల నుంచి చల్లటి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే దిగువకు చేరాయి. పగటిపూట ఉక్కపోత ఉన్నా.. సాయంత్రం నుంచి చలిగాలులు వణికిస్తున్నాయి.
ఆకాశం మేఘావృతం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2–3 డిగ్రీలు తగ్గాయి. వికారాబాద్లో అత్యల్పంగా 14.7 డిగ్రీలు, ఆదిలాబాద్లో 14.8, సంగారెడ్డి, నిజామాబాద్లో 14.9 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో మాత్రం 20 డిగ్రీలుగా రికార్డయ్యాయి. నగరంలో తుఫాను ప్రభావంతో సాధారణ వర్షాలే కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఏపీ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
ఆర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల–విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాం సమీపంలో బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 125–150 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తూ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాను ముప్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 12కి పైగా ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తీర ప్రాంతాల్లో 30 వేలకు పైగా చేపల వేట పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం వందలాది పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది.
