భారతీయ వంటగదిలో పప్పుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలో కందిపప్పు కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దేశీయ డిమాండ్‌ను తట్టుకునేందుకు భారత్ ఇతర దేశాల నుంచి భారీగా పప్పు ధాన్యాలను దిగుమతులను పెంచుతున్నప్పటికీ ధరల మంట మాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో దేశానికి వచ్చిన పప్పుధాన్యాల దిగుమతి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 67 శాతం పెరిగి 2.06 మిలియన్ టన్నులకు చేరుకుంది. కేవలం పరిమాణమే కాకుండా.. వీటిని కొనుగోలు చేయడానికి వెచ్చించిన మొత్తం కూడా భారీగా పెరిగింది. ఈ 5 నెలల కాలంలో దిగుమతుల కోసం ప్రభుత్వం, వ్యాపారులు ఏకంగా రూ.12వేల కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 38 శాతం ఎక్కువ.
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు అన్ని రకాల పప్పుధాన్యాల ధరలు పెరిగిపోయాయి. కేజీ కందిపప్పు రేటు ప్రస్తుతం రూ.133గా ఉంది. ఇది గతంతో పోల్చితే 15 శాతం అధికం. ఇక మినపప్పు కిలో రూ.126 వద్ద అమ్ముతున్నారు. గతంలో కంటే దీని రేటు కేజీకి 10 శాతం పెరిగింది. ఇక శనగ పప్పు కిలో రూ.94 పలుకుతుండగా.. ఇది గతం కంటే 7.5 శాతం అధికం.
ధరలు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి?
పప్పుధాన్యాల ధరలు అంతకంతకూ పెరుగుతుండటానికి ప్రధానంగా కొన్ని అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు కారణమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిని, కెనడా నుంచి రావాల్సిన మసూర్ పప్పు, పసుపు బఠానీల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు శనగలు, పసుపు బఠానీలు, మసూర్ పప్పులపై దిగుమతి సుంకాలు ఉండటం వల్ల విదేశాల నుంచి కొనుగోలు చేసే భారం పెరిగింది.
►ALSO READ | జాయ్‌అలుక్కాస్ సంచలనం: రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన 16 కిలోల బంగారు జుమ్కాలు!
ఎల్‌నినో ఎఫెక్ట్..
ఇప్పటికే ఉన్న కష్టాలు చాలవన్నట్లు దేశీయంగా వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రముఖ వ్యవసాయ ప్రాంతాల్లో సరిగా వర్షాలు పడకపోవడం.. ముఖ్యంగా ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల రాబోయే కాలంలో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ప్రస్తుతానికి ప్రభుత్వవ్యాప్తంగా దాదాపు 4.5 మిలియన్ టన్నుల పప్పుధాన్యాల బఫర్ స్టాక్ అందుబాటులో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. దేశీయంగా డిమాండ్‌కి తగినట్లుగా దిగుమతులు పెరిగిపోతున్న వేళ సమీప కాలంలో పప్పు ధాన్యాల రేట్లు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వృథాను అరికట్టడం, నిల్వ చేసుకునే వీలున్న ఆహార పదార్ధాల విషయంలో ఆచితూచి ఖర్చు చేయడం కిచెన్ బడ్జెట్ పై ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
