కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పిల్లలు పుట్టడం లేదనే కారణంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వరూప హత్య కేసులో నిందితుడు దావు చంద్రకుమార్ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అక్టోబర్ 25 రాత్రి అద్దె ఇంట్లో నిద్రిస్తున్న భార్య స్వరూపను చంద్రకుమార్ గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పిల్లలు కలగడం లేదనే కారణంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిందితుడు ప్రయత్నించాడు. విడాకులకు భార్య, ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం పరారైన నిందితుడు ట్రైన్ ఎక్కి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులు తరలించారు.
