ఐఎంఏ స్టేట్ చీఫ్ గా డా.జగన్మోహన్ రావు

ఐఎంఏ స్టేట్ చీఫ్ గా డా.జగన్మోహన్ రావు

కరీంనగర్ టౌన్,వెలుగు: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఐఎంఏ శాఖకు చెందిన డాక్టర్ జగన్‌‌‌‌‌‌‌‌మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పొలాస రామ్ కిరణ్ ఎన్నికయ్యారు.

హైదరాబాద్ కోఠిలోని ఐఎంఏ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం రాత్రి వరకు ఎన్నికలు జరగగా, విజేతలను సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యుల సంక్షేమానికి, సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

 ప్రజారోగ్యం, వైద్యుడు, రోగి సంబంధాలు, ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం, అపోహల నివారణ, నైతిక వైద్య విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో సేవలందించే చిన్న నర్సింగ్ హోమ్‌‌‌‌‌‌‌‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. 

కార్పొరేట్ ఆస్పత్రుల ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఆస్పత్రులు ఎంతో ఉపయోగకరమని, వాటిని కాపాడుకోవడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. డాక్టర్ జగన్‌‌‌‌‌‌‌‌మోహన్ రావు భారీ మెజార్టీతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, డాక్టర్ పొలాస రామ్ కిరణ్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్ కె. శ్యామ్ సుందర్, డాక్టర్ కె. రాజేశ్వర్, డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ అలీం, డాక్టర్ జి. వెంకట రెడ్డి, డాక్టర్ ఎ. శైలజ రాష్ట్ర కమిటీలోని ఇతర కార్యవర్గ పదవులకు ఎన్నికయ్యారు.