జగిత్యాలలో బకెట్ నీళ్ల కోసం గొడవ.. మేనమామకు మూడు కత్తిపోట్లు

జగిత్యాలలో బకెట్ నీళ్ల కోసం గొడవ.. మేనమామకు మూడు కత్తిపోట్లు

జగిత్యాల జిల్లా: బకెట్ నీళ్ల విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన మేనమామపై అల్లుడు కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ తండాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వాల్గొండ తండాకు చెందిన బోడాసు అజయ్ బకెట్ నీళ్ల కోసం ఇంటి పక్కనే ఉన్న తన తాత ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడికి ఎందుకు వచ్చావంటూ తాత ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అనంతరం తాతతో పాటు మేనత్తను అజయ్ నెట్టడంతో గొడవ మరింత పెరిగినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న మేనమామ దేవుళ్ల గంగారాం వివాదం గురించి అడిగేందుకు అక్కడికి వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్ కత్తితో గంగారాంపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గంగారాం గుండె పక్క భాగంలో మూడు కత్తిపోట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు గాయపడిన గంగారాంను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.