తమిళనాడులో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 14 మంది మృతి

తమిళనాడులో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 14 మంది మృతి
  • భారీ వర్షాల నేపథ్యంలో  రెడ్ అలర్ట్ జారీ

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, పిడుగులు తమిళనాడును వణికిస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి  నుంచి ఇప్పటివరకు పిడుగుపాటు ఘటనల కారణంగా రాష్ట్రంలో ఏకంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. వర్షాలు తగ్గే వరకు నీలగిరి, కొడైకెనాల్ ఏర్‌‌‌‌‌‌‌‌కాడ్ తో సహా ఇతర ప్రధాన హిల్ స్టేషన్లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించామన్నారు. పిడుగులుపడి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు మంత్రి వెల్లడించారు. 

వర్షాల కారణంగా ఒక్కరోజే 35 మంది మరణించారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వర్షాల వల్ల ఇప్పటిదాకా 14 మంది మాత్రమే చనిపోయారని.. మిగతా మరణాలు సహజ మరణాలా లేక చిన్న గోడలు కూలడం వంటి ఘటనల వల్ల సంభవించినవా అనే దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ జరుపుతున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా నీలగిరి జిల్లాలో  62 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

మరోవైపు, ఎడతెరిపిలేని వర్షాల వల్ల తమిళనాడులోని ప్రధాన నగరాల్లో  జనజీవనం అస్తవ్యస్తమైంది. కొడైకెనాల్‌‌‌‌‌‌‌‌లోని మూంజిక్కల్-డోబికానా ప్రాంతంలో 20కి పైగా ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. తమ సామగ్రిని, పశువులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వర్షాల వల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి మట్టం పెరుగుతోంది. తేని జిల్లాలోని వైగై డ్యామ్ నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.