ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల లిస్టులో అనేక తప్పులు బయటపడటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల పేర్లను మరోసారి పరిశీలించాలని భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశించింది. ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం, వివరాలను సవరించడం కోసం ఉపయోగించే ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా జరిగిన మార్పులన్నింటినీ తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా పిలిభిత్, అజంగఢ్ జిల్లాల్లో ఓటర్ల లిస్టులో నమోదైన కొన్ని వింత పేర్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఫార్మ్ నింపడంపై కొత్త నిబంధనలు
ఓటర్ల లిస్టుకు సంబంధించిన ఫార్మ్ కంప్యూటర్ ఆపరేటర్/ సహాయకులు నింపకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లు స్వయంగా ఇచ్చిన ఫార్మ్ బూత్ స్థాయి అధికారి (BLO) యాప్ ద్వారా డిజిటల్ రూపంలో ఎంటర్ చేయాలి. ఓటర్ల లిస్టును పరిశీలించేందుకు రాష్ట్రంలోని డివిజనల్ కమిషనర్లను పరిశీలకులుగా నియమించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా తెలిపారు.
2 కోట్లకు పైగా
స్పెషల్ ఇంటెన్సివ్ రేవిజన్ (SIR) తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2025 అక్టోబర్ 27న వచ్చిన లిస్టులో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2026 ఏప్రిల్ 10న విడుదల చేసిన ఫైనల్ లిస్టులో 13.39 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.
ఓటర్ల లిస్టులో ఇలాంటి పేర్లు
అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటర్ల లిస్టులో కొన్ని అసాధారణమైన పేర్లు కనిపించాయి. వాటిలో “రామ్ నే యాదవ్ కో మారా”, “రామ్ నే శర్మ కో మారా” వంటి వాక్యాలు ఓటర్ల పేర్లుగా నమోదయ్యాయి. వీటి అర్థం “రాముడు యాదవ్‌ను కొట్టాడు” ఇంకా “రాముడు శర్మను కొట్టాడు” అని వస్తుంది. ఈ పేర్లు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఓటర్ల లిస్టులో కులపరమైన వివక్ష జరిగిందా ? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. రాముడు యాదవులను ఎందుకు కొట్టాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించగా, "దేవుడి దయవల్ల రాముడు ఏ మైనారిటీలనూ కొట్టలేదు" అని ఉత్తర ప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ అధికారి స్పష్టం చేశారు.
అయితే, ఈ ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. కంప్యూటర్ లేదా సాఫ్ట్‌వేర్‌కు కుల వివక్ష ఉండదని, ఇవి సాఫ్ట్వేర్ అనువాదంలో జరిగిన పొరపాట్లని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరో తప్పుగా నమోదైన వివరాలని కూడా ఎన్నికల సంఘం ఉదాహరణగా చూపించింది.
తండ్రి పేరు స్థానంలో
ఓటర్ల లిస్టులో మరికొన్ని విచిత్రమైన తప్పులు కూడా బయటపడ్డాయి. కొందరి తండ్రి పేర్ల స్థానంలో “బి.కామ్” వంటి విద్యార్హతలు నమోదయ్యాయి. మరో చోట తల్లిదండ్రుల వివరాల్లో “ముర్ఖ్ చంద్ యాదవ్” అనే పేరు కనిపించింది. అజంగఢ్ జిల్లాలో “వికాస్ యాదవ్” అనే పేరు ఏకంగా 13 సార్లు నమోదైనట్లు గుర్తించారు.
తప్పులు మళ్లీ జరగకుండా
ఓటర్ల లిస్టులో ఇలాంటి తప్పులు ఎందుకు జరిగాయో పరిశీలిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఓటరు స్లిప్పులు నకిలీవి కావచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. వాటిని నిజమైనవిగా భావించి ప్రచారం చేసే ముందు సంబంధిత అధికారులతో ధ్రువీకరించుకోవాలని సూచించింది. నకిలీ స్లిప్పులు తయారు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓటర్ల లిస్టులో తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి అధికారులు స్పందిస్తారని కూడా ఎన్నికల సంఘం తెలిపింది.
