మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు పట్టణంలో రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పట్టణ సుందరీకరణతో పాటు రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు.
చెన్నూరు పట్టణంలో రూ.5.50 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యల్లో భాగంగా మహంకాళి వాడ నుంచి నేషనల్ హైవే వరకు రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు ఈ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా శాశ్వత మౌలిక వసతుల కల్పన, పుష్కర ఘాట్ల విస్తరణ కోసం ప్రభుత్వ పరంగా సుమారు రూ.70 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అవసరమైన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడా రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.
