టాలీవుడ్లో ‘ఇడుపు కాయితం’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమాలోని ‘గడప’ పాటలో పెళ్లి వేడుకలో భోజనంతో పాటు మద్యం వడ్డించే దృశ్యాలు ఉండటంపై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఇలా చూపించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, పెళ్లిళ్లలో ఆచారాలు, సంప్రదాయాలు కుటుంబాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలను బట్టి మారుతుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రాంతంలో కనిపించే పద్ధతిని మొత్తం తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా చూడటం సరికాదని అంటున్నారు.
ట్రోల్స్‌పై దర్శకుడు వేణు ఊడుగుల ఫైర్..
ఈ వివాదంపై దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా స్పందించారు. తెలంగాణ సంస్కృతిని తప్పుగా అర్థం చేసుకుంటూ విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఒక సమాజపు సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే దాని చరిత్ర, శ్రమ, కళలు, పోరాటాలను తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
‘‘ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం. సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి’’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి. #IdupuKayitham #Telangana #Culture
— v e n u u d u g u l a (@venuudugulafilm) October 25, 2026
వివాదం సద్దుమణుగుతుందా?
తెలంగాణ సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానంపై మరోసారి చర్చకు తెరలేపిన ‘ఇడుపు కాయితం’.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు పాటలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ప్రాంతీయ సంస్కృతిని సమగ్రంగా అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన స్పందనతో ఈ వివాదానికి తెరపడుతుందా? లేక సినిమా విడుదలకు ముందే ఈ అంశం మరింత చర్చకు దారితీస్తుందా? అనేది వేచి చూడాలి.
