హైదరాబాద్: నగరంలో వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపే దిశగా హైడ్రా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కృష్ణాకాంత్ పార్కులోని చెరువు విస్తరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 3 ఎకరాలకే పరిమితమైన చెరువును 12 ఎకరాలకు విస్తరించనున్నారు. గతంలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు క్రమంగా కుదించుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్, వెంకటగిరి, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు కృష్ణాకాంత్ పార్కులోని చెరువులోకి చేరుతుంది. అయితే, చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో భారీ వర్షాల సమయంలో నీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదు. కేవలం 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేటలోని మైత్రీవనం పరిసర ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా చెరువు విస్తరణ పనులు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది.
చెరువు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు లోతును కూడా పెంచేందుకు హైడ్రా ప్రణాళిక రూపొందించింది. వరద నీరు సులభంగా చెరువులోకి చేరేందుకు ఇన్లెట్లను అభివృద్ధి చేయనున్నారు. చెరువు నిండిన తర్వాత నీరు బయటకు వెళ్లేందుకు ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నారు. చెరువు చుట్టూ బండ్ నిర్మించడంతో పాటు పాత్‌వేను అభివృద్ధి చేయనున్నారు.
చెరువు అభివృద్ధితో పాటు పార్కులో సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించనున్నారు. చెరువు చుట్టూ కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న ఓపెన్ జిమ్‌కు అదనంగా మరో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల ప్లే ఏరియా, గెజిబోల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బోటు షికారుకు అనువుగా చెరువును తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.
ప్రస్తుతం మురుగునీటి నిలయంగా మారిన చెరువును అభివృద్ధి చేసి, దాని సహజ లక్షణాలను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు కూడా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
చెరువు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడున్న చెట్లను శాస్త్రీయ పద్ధతిలో సురక్షితంగా తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులు తీసుకుని, అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. తరలించిన చెట్లను సున్నం చెరువు సమీపంలో హైడ్రా అభివృద్ధి చేసిన ప్రాంతంలో తిరిగి నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
