ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా ఎలాంటి నష్టాలభయం లేని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని భావిస్తారు. అలాంటి వారి కోసం భారత ప్రభుత్వానికి చెందిన పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) అద్భుతమైన ఆప్షన్లుగా నిలుస్తాయి. ఈ రెండు సేవింగ్ స్కీమ్స్ సురక్షితమే అయినప్పటికీ.. వీటి వడ్డీ రేట్లు, కాలపరిమితి, పన్ను మినహాయింపులు వేర్వేరుగా ఉంటాయి. నెలకు రూ.10వేలు చొప్పున పెట్టుబడి పెడితే ఏ స్కీమ్ ద్వారా ఎంత లాభం పొందవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం...
ప్రస్తుత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి.. పోస్టాఫీసు ఆర్డీపై వార్షిక వడ్డీ రేటు 6.7% గా ఉంది. అలాగే PPF పథకంపై వార్షిక వడ్డీ రేటు 7.1%గా లభిస్తోంది. ఆర్డీ కాలపరిమితి సాధారణంగా 5 సంవత్సరాలుగా ఉంటే.. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఒకవేళ మీరు ఈ రెండు పథకాల్లోనూ క్రమం తప్పకుండా నెలకు రూ.10వేల చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. రెండు పథకాల్లోనూ మీ మొత్తం పెట్టుబడి రూ.18 లక్షలు అవుతుంది. అయితే వచ్చే రాబడిలో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
15 ఏళ్లకు పోస్టాఫీసు ఆర్డీలో ఎక్స్టెన్షన్లు, రీఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం అంచనా మొత్తంగా రూ.24లక్షల 22వేల 205 వరకు ఉంటుంది. ఇందులో కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ.6లక్షల 22వేల 205 వరకు లభిస్తుంది. అదే PPF విషయానికి వస్తే.. 15 సంవత్సరాల పెట్టుబడి ముగిసేసరికి మీ చేతికి సుమారుగా రూ.32లక్షల 54వేల 567 వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ.14లక్షల 54వేల 567 లాభం పొందవచ్చు. ఈ లెక్కలను బట్టి చూస్తే.. పీపీఎఫ్ ద్వారా మెరుగైన సంపదను సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టమౌతోంది.
అయితే ఏ పథకం ఎంచుకోవాలి అనేది పూర్తిగా మీ ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి పీపీఎఫ్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. పీపీఎఫ్ లో వచ్చే వడ్డీకి, మెచ్యూరిటీ మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదు. అంతేకాకుండా పాత పన్ను విధానంలో సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందులో ఏడాదికి గరిష్టంగా రూ.లక్షా 50వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. కాబట్టి నెలకు రూ.10వేలు సేవ్ చేసేవారికి ఇది చాలా సరిగ్గా సరిపోతుంది.
ALSO READ : ఆర్థికంగా టాప్.. జీవన ప్రమాణాల్లో వీక్
తక్కువ కాలపరిమితితో క్రమశిక్షణగా ప్రతినెలా పొదుపు అలవాటు చేసుకోవాలనుకునే వారికి పోస్టాఫీసు ఆర్డీ చక్కటి ఎంపిక. దీని ప్రారంభ కాలం 5 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ.. నిబంధనల ప్రకారం దానిని పొడిగించుకోవచ్చు. కానీ 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం దీనిని సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పన్ను ఆదా చేస్తూ ఎక్కువ రాబడి కోరుకునే వారికి పీపీఎఫ్ మంచిది. చిన్న మొత్తాలతో క్రమశిక్షణగా పొదుపు ప్రారంభించాలనుకునేవారికి ఆర్డీ ఉపయోగపడుతుంది.
