ఆర్థికంగా టాప్.. జీవన ప్రమాణాల్లో వీక్: గ్లోబల్ సిటీస్ జాబితాలో 421వ స్థానంలో నిలిచిన హైదరాబాద్

ఆర్థికంగా టాప్.. జీవన ప్రమాణాల్లో వీక్: గ్లోబల్ సిటీస్ జాబితాలో 421వ స్థానంలో నిలిచిన హైదరాబాద్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలపై ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ 'గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026' నివేదికను విడుదల చేసింది. ఈ లిస్టులో మన హైదరాబాద్‌కు 421వ స్థానం దక్కింది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల పరంగా నగరానికి మంచి మార్కులే పడినప్పటికీ.. క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్యావరణం విషయాల్లో మాత్రం వెనుకబడిపోయింది. 

హైదరాబాద్ ఆర్థిక రంగంలో 248వ స్థానంలో, మానవ వనరుల విభాగంలో 241వ స్థానంలో నిలిచింది. నగరంలో ఉన్న మంచి విద్యాలయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఉపాధి అవకాశాలు ఈ విభాగాల్లో మంచి ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం. అయితే ఈ బలమైన అంశాలు ప్రజల జీవన ప్రమాణాలను మాత్రం పెంచలేకపోతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. 

క్వాలిటీ ఆఫ్ లైఫ్ విభాగంలో హైదరాబాద్ ఏకంగా 818వ స్థానానికి పడిపోయింది. అలాగే పర్యావరణ విభాగంలో 657వ స్థానాన్ని దక్కించుకుంది. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి, విపరీతంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు, మౌలిక వసతులపై ఒత్తిడి వంటివే ఈ వెనుకబాటుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ 268, బెంగళూరు 311, ముంబై 330, చెన్నై 381 స్థానాలను దక్కించుకుని హైదరాబాద్ కంటే ముందంజలో నిలిచాయి. 

ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్న హైదరాబాద్.. తన సంపదను ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రోడ్లను మెరుగుపరచడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారానే భాగ్య నగరంలో ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిపై నాయకులు ఫోకస్ చేస్తే రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింత మెరుగైన ర్యాంక్ సాధించటమే కాకుండా ప్రజాధరణను పొందుతుందని రిపోర్ట్ హైలైట్ చేసింది.