కొత్త వివాదంలో 'ఇడుపు కాయితం'.. తెలంగాణ సంస్కృతిని వక్రీకరించారంటూ ప్రియదర్శి, బన్నీ వాస్‌పై నెటిజన్లు ఫైర్!

కొత్త వివాదంలో 'ఇడుపు కాయితం'.. తెలంగాణ సంస్కృతిని వక్రీకరించారంటూ ప్రియదర్శి, బన్నీ వాస్‌పై నెటిజన్లు ఫైర్!

Idupu Kayitham Controversy: టాలీవుడ్‌లో విడుదలకు ముందే చర్చల్లో నిలుస్తున్న సినిమాల్లో  'ఇడుపు కాయితం' ఒకటి. ఇందులో ప్రియదర్శి , నాగదుర్గ జంటగా నటిస్తున్నారు. అయితే ఈ రొమాంటిక్ డ్రామా టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచే కాదు .. లేటెస్ట్ గా విడుదలైన 'గడప' పాటలో చూపించిన దృశ్యాలు కూడా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చ.. ఈ సినిమా కథ, నటీనటుల గురించి కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రస్తావనతో వివాదానికి దారితీసింది. నిర్మాత బన్నీ వాస్, హీరో ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పొలాలపై వ్యాఖ్యలు..

'ఇడుపు కాయితం' సినిమా షూటింగ్‌ సందర్భంగా ఓ మారుమూల గ్రామానికి వెళ్లినప్పుడు తెలంగాణలో ఇన్ని పచ్చని పొలాలు, వరి చేలు ఉంటాయని ఊహించలేదని నిర్మాత బన్నీ వాస్ వ్యాఖ్యానించారు.  దీంతో తెలంగాణలోని భౌగోళిక వైవిధ్యం, వ్యవసాయ నేపథ్యంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని మరి కొందరు సమర్థిస్తున్నారు

పెళ్లిలో మందుపై అభ్యంతరాలు..

మరోవైపు, హీరో ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు కారణమయ్యాయి. తెలంగాణలో పెళ్లిళ్లు, విందుల్లో మద్యం వడ్డించే విధానాన్ని ప్రస్తావించిన ఆయన మాటలు, ఈ ఆచారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా ఉన్నట్లుగా అర్థం చేసుకునే అవకాశం కల్పించాయని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన పాటలోనూ పెళ్లి వేడుకలో బోజనం వడ్డించడంతో పాటు గ్లాసుల్లో మద్యం అందిస్తూ చూపించడం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే సంప్రదాయాలు కుటుంబాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలను బట్టి మారుతుంటాయని, ఒక విధానాన్ని మొత్తం తెలంగాణకు ఆపాదించలేమని పలువురు పేర్కొంటున్నారు.

డిసెంబర్ 11న సినిమా విడుదల

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ కథానాయికగా నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, బన్నీ వాస్ వర్క్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే వివాదాలు చుట్టుముట్టడంతో ఆసక్తి పెరుగుతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లోని వ్యాఖ్యలు, పాటలోని కొన్ని సన్నివేశాల ఆధారంగా మొత్తం చిత్రంపై తీర్పు ఇవ్వడం తొందరపాటు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.. తెరపై తెలంగాణ నేపథ్యాన్ని చిత్రబృందం ఎలా ఆవిష్కరించిందో సినిమా విడుదలయ్యాకే స్పష్టత రానుందని చెబుతున్నారు.