ఢిల్లీ పోలీస్ శాఖ నివ్వెరపోయింది.. షాక్ అయ్యింది. ఎందుకంటే వచ్చిన కంప్లయింట్ అలాంటిది.. ఒకే బ్యాచ్ కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను.. ఒకే ఒక్కడు.. పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాటలు కలిపాడు.. షికార్లకు తీసుకెళ్లాడు.. నమ్మించాడు.. ధనవంతుడిగా ఫోజులు కొట్టాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. నిజమే అనుకున్న ఆ మహిళా కానిస్టేబుళ్లు.. అతను చెప్పిన ప్రతి దానికీ తల ఊపారు. ఈ కిలాడీగాడు మాత్రం.. మాయ మాటలు చెప్పిన డబ్బులు వసూలు చేశాడు. బండారం బయట పడిన తర్వాత ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు.. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పోలీస్ శాఖనే షాక్ కు గురి చేసింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
వీడి పేరు విక్రాంత్ తోమర్. వయస్సు జస్ట్ 23 ఏళ్లు. ఇన్ స్టాలో వీడు పెట్టే పోస్టులు చూస్తే వీడు టాటా బిర్లా అంబానీ వారసుడి లెక్క ఉంటాయి. అంతా లగ్జరీ. కాఫీ తాగినా స్టార్ బక్స్.. వాడే కారు లగ్జరీ.. వేసుకునే బట్టలు బ్రాండెడ్.. చేతికి ఫారిన్ వాచీ.. ఇక లుక్స్ అంటారా బాలీవుడ్ హీరో లెక్క.. 23 ఏళ్ల ఈ విక్రాంత్ తోమర్ కు ఇన్ స్టాలో మొదటగా ఓ మహిళా కానిస్టేబుల్ పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే ఓ మహిళా కానిస్టేబుల్ తో సహజీవనం మొదలుపెట్టాడు. ఆమె నుంచి మిగతా మహిళా కానిస్టేబుళ్ల వివరాలు తీసుకోవటం.. వాళ్లతో పరిచయం పెంచుకోవటం... అక్కడి నుంచి ఈ కిలాడీగాడు కథ అంతా నడిపాడు.
మొదట ఫ్రెండ్ గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన లగ్జరీ కార్లలో షికార్లకు తీసుకెళ్లేవాడు. కాఫీ షాపులు, ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వటం ఇలా మంచిగా ఉండేవాడు. పెద్ద వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత అత్యవసరం అంటూ ఆ మహిళా కానిస్టేబుల్ దగ్గర డబ్బులు తీసుకునే వాడు. మొదటగా పరిచయం అయిన మహిళా కానిస్టేబుల్ నుంచి.. అదే బ్యాచ్ లో ఉన్న మిగతా వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో స్నేహం చేశాడు. అందరికీ ఒకే కథ.. ధనవంతుడిని అని.. ఈ విక్రాంత్ తోమర్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టే ఫొటోలు.. రియల్ లైఫ్ ఒకటే అనుకున్నారు. ఈ విధంగా పరిచయం కాస్తా.. పెళ్లి వరకు తీసుకొచ్చేవాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించే వాడు. ఆ తర్వాత ఆ ఖర్చులు, ఈ ఖర్చులు.. క్రెడిట్ కార్డు పని చేయటం లేదు.. అర్జంట్ గా డబ్బులు అవసరం అయ్యింది.. రెండు రోజుల్లో ఇస్తా అంటూ.. మొత్తం 20 మంది మహిళా కానిస్టేబుళ్ల దగ్గర నుంచి ఏకంగా 24 లక్షల రూపాయలు వసూలు చేశాడు.
పెళ్లి మాటలు పీటల దగ్గరకు వెళ్లాలి కదా.. ఆ విధంగా కొంత మంది మహిళా కానిస్టేబుళ్ల ఒత్తిడి చేయటంతో మనోడి అసలు బండారం బయటపడింది. ఈ విక్రాంత్ తోమర్ వాడే లగ్జరీ కార్లు అద్దెకు తీసుకుని వచ్చేవి అంట.. ఇక మనోడు ఉండేది ఓ చిన్న ఇంట్లో అంట.. మొత్తంగా మనోడి బంగారం బయటపడింది. అంతా డ్రామా అని.. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని అర్థం అయ్యింది. ఇంకేముందీ ఢిల్లీలోని మాయాపురి, హరినగర్, ఇంద్రపురి, ఢిల్లీ తూర్పు సైబర్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. తోమర్ కోసం వేట సాగించగా బురారీలో అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.
విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనోడు గతంలోనే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అంతేనా.. ఈ మొత్తం కుట్రలో అతనితో సహజీవనం చేస్తున్న ఆ మహిళా కానిస్టేబుల్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఏదిఏమైనా 23 ఏళ్లకే.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసం చేశాడంటే.. వీడు మామూలోడు కాదంటున్నారు విచారణ పోలీసులు.
