హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్లు.. గుజరాత్ యూనివర్సిటీ వినూత్న ప్రయోగం

హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్లు.. గుజరాత్ యూనివర్సిటీ వినూత్న ప్రయోగం

ఇటీల కాలంలో హాస్టళ్లలో  విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతున్నాయి.చదువు వెనకబడ్డామని కొందరు.. ర్యాగింగ్ తో కొందరు, ఇతర చిన్న చిన్న కారణాలతో కూడా విద్యార్థులు బలవర్మరణాలకు పాల్పడుతున్నారు.  అయితే ఈ ఆత్మహత్యల్లో ఉరి వేసుకొని చనిపోయినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా హాస్టల్ గదుల్లో ఫ్యాన్లకు విద్యార్థులు వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలే అధికం.. ఇలాంటి సమయంలో గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.  ఈ ఫ్యాన్లు ఎలా పనిచేస్తాయి.. ఆత్మహత్య ప్రయత్నాలను ఎలా నివారిస్తోయో చూద్దాం.. 

గుజరాత్‌లోని సూరత్‌లో వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక ఫ్యాన్లను ఏర్పాటు చేస్తోంది. ఆత్మహత్యలను నివారించేందుకు యూనివర్సిటీ పరిధిలోని తొమ్మిది హాస్టళ్లలో మొత్తం 388 స్ప్రింగ్‌ మెకానిజం సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ యాంటీ సూసైడ్ ఫ్యాన్లలో ప్రత్యేక స్ప్రింగ్ వ్యవస్థ ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ ఫ్యాన్ల మాదిరిగానే పనిచేస్తాయి.10 కిలోల కంటే ఎక్కువ బరువు పడితే కిందికి వంగేలా రూపొందించారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఫ్యాన్లను ఉరి వేసుకోవడానికి ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించవచ్చని యూనివర్సిటీ భావిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు బాలికల హాస్టళ్లలో 170, నాలుగు బాలుర హాస్టళ్లలో 218 ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఫ్యాన్ ధర రూ.2వేల500 కంటే ఎక్కువగా ఉంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు వైస్‌ ఛాన్సలర్ కిషోర్‌సింగ్ చావడా చెప్పారు. పరీక్షల్లో ఎన్నిసార్లు విఫలమైనా విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని, పరీక్షల ఒత్తిడితో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

ఫ్యాన్ల ఏర్పాటు ఒక భద్రతా చర్య మాత్రమేనని, విద్యార్థులకు కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం కూడా అందించడం చాలా ముఖ్యం.