అనగనగనగా మధనాపురం అనే ఓ పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో భూపాలుడు అనే పెద్దమనిషి ఉండేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కాదనకుండా సాయం చేసేవాడు. పేదలకు ధన సాయం కూడా చేస్తూ ఆదుకునేవాడు. అదే ఊరిలో దిక్కూ మొక్కూ లేని సత్యమమ్మ ఉండేది. ఒక పూరి గుడిసెలో బతుకుతుండేది. కాయాకష్టం చేస్తూ పైసా.. పైసా కూడబెట్టుకునేది. కొంతకాలం తర్వాత ఆమె దాచుకున్న డబ్బుతో చిన్న బంగారు హారం చేయించుకుంది. అదే ఊర్లో పని- పాటా లేకుండా జులాయిగా తిరిగే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అప్పటికే అనేకసార్లు చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డాడు.
ఒకరోజు రాత్రిపూట ఒంటరిగా నిద్రిస్తున్న సత్యమమ్మ ఇంటికి వెళ్లి, ఆమెకు తెలియకుండా మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించాడు. ఆమె తెల్లవారాక చూసుకుని, లబోదిబోమని ఏడ్చుకుంటూ ఊరి పెద్దమనిషి భూపాలుడి దగ్గరికి వెళ్లింది. న్యాయం చేయమని వేడుకుంది. జరిగిన విషయం విన్న ఆ పెద్దమనిషి ఆమెకు ధైర్యం చెప్పి "బంగారు హారం దొంగను తొందరలోనే పట్టుకుని, హారాన్ని నీకు అందిస్తాన”ని హామీ ఇచ్చి పంపించాడు.
ఆ మరుసటి రోజే గ్రామంలోని మగవాళ్లందరినీ ఆంజనేయస్వామి గుడి దగ్గరికి పిలిచాడు. బంగారు గొలుసును తస్కరించిన వాళ్లు ఎవరైనా.. తప్పు ఒప్పుకొని తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించాడు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. 'నేను కాదంటే.. నేను కాద'ని చెప్పారు. దాంతో భూపాలుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఎవరికీ తెలియకుండా ఒక మట్టి కుండ తెప్పించి, దానికి మసి పూయించి ఒక గదిలో ఉంచాడు. లోపల ఉన్నది మహిమగల కుండ అని, ఒక్కొక్కరూ వెళ్లి కళ్ళు మూసుకొని చేతితో ముట్టుకొని... కళ్ళు తెరవకుండా బయటకు రావాలని అన్నాడు, "ఎవరు దొంగతనం చేస్తే వాళ్ల చేతికి మసి అంటుతుంద”ని చెప్పాడు. అలా ఒక్కొక్కరూ లోపలికి పోయి బయటికి వచ్చారు.
భూపాలుడు అందరినీ వరుసగా నిలబెట్టి అందరి చేతులను పరిశీలించాడు. దొంగతనం చేసిన వ్యక్తి చేతికి తప్ప, అందరి చేతులకు మసి ఉంది. భూపాలుడు నవ్వుతూ... "అది మహిమ గల కుండ కాదు. వట్టి మసి పూసిన మట్టి కుండ. ముట్టుకున్న వాళ్లందరికీ మసి అంటుతుంది. కానీ ఆ దొంగతనం చేసిన వ్యక్తి భయపడి కుండను ముట్టుకోకుండానే బయటికి వచ్చాడు. అందుకే అతని చేతికి మసి అంటలేదు" అంటూ తప్పు చేసిన వ్యక్తిని మందలించి, దొంగిలించిన గొలుసును రాబట్టాడు. బంగారు గొలుసును సత్యమమ్మకు ఇవ్వడమే కాకుండా, కొంత ధాన్యాన్ని కూడా ఇచ్చి పంపాడు. సత్యమమ్మ ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ విధంగా ఆ గ్రామంలో ఏ తప్పు జరిగినా, ఎంతో చాకచక్యంగా, తగిన ఉపాయం ఆలోచించి భూపాలుడు సమస్యలను పరిష్కరించి న్యాయం చేసేవాడు.
-కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, నల్గొండ
