హైదరాబాద్ సిటీలో తాగునీటి వినియోగాన్ని తగ్గించి, నీటి వనరులను కాపాడేందుకు జలమండలి నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సేవలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రం చేసిన నీటిని నిర్మాణాలు, పరిశ్రమలు, పార్కులు, మొక్కలకు నీరు పోయడం, రోడ్ల శుభ్రత వంటి పనులకు సరఫరా చేయనున్నారు.
ఈ సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు జీపీఎస్ పరికరాలు, ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్లైన్ బుకింగ్, ట్యాంకర్ల కేటాయింపు, డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు కల్పించనున్నారు. సొంత ట్యాంకర్లు ఉన్నవారితో పాటు, ట్యాంకర్లు లేని వారికి కూడా నీటిని సరఫరా చేయనున్నారు.
మరోవైపు, జలమండలి కార్యాలయాల్లో నీరు, విద్యుత్ వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని ఎండీ కె. అశోక్ రెడ్డి ఆదేశించారు. ఏసీలను 25 డిగ్రీల వద్ద ఉంచాలని, సాయంత్రం 5 గంటల తర్వాత ఆఫ్ చేయాలని సూచించారు. లీకేజీలను అరికట్టి, ఏసీల నుంచి వచ్చే నీటిని తిరిగి వినియోగించాలని తెలిపారు. నవంబర్ 1 నాటికి గ్రీన్ వాటర్ సేవలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
