Samantha: "విజయ్ నా లక్కీ చార్మ్.. ఆయనంటే ఇష్టం!".. విజయ్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: "విజయ్ నా లక్కీ చార్మ్.. ఆయనంటే ఇష్టం!".. విజయ్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. విజయ్‌ను తన 'లక్కీ చార్మ్’గా అభివర్ణించిన సమంత.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టిన తీరును ప్రశంసించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూడు సినిమాలు సూపర్ హిట్స్..

ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న సమంత 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ్' టీవీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. ఓ ఎపిసోడ్‌లో 'హీరో వర్సెస్ విలన్' ఛాలెంజ్ సందర్భంగా ఆర్జే విజయ్.. మీకు ఇష్టమైన స్టార్ ఎవరు? అని ప్రశ్నించగా, సమంత ఏమాత్రం తడబడకుండా విజయ్ పేరు చెప్పారు.

'ఆయన నా లక్కీ చార్మ్. ఆయనతో కలిసి నటించిన మూడు చిత్రాలు సూపర్‌హిట్' అని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'కత్తి'(2014), 'తెరి' (2016), 'మెర్సల్' (2017) చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల్లో వీరి జోడీకి మంచి గుర్తింపు లభించింది.

సరైన సమయంలో రాజకీయాల్లోకి.. ..
విజయ్ నటుడిగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి రావడంపై సమంత ప్రశంసలు కురిపించారు.  కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నాయకుడిగా మారడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యక్తిగా తనకు స్ఫూర్తినిస్తారని, ఆయన తెరవెనుక ప్రశాంతంగా, ఏకాగ్రతతో పనిచేయడం గొప్ప విషయమని సమంత పేర్కొన్నారు. సరైన సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కూడా వ్యాఖ్యానించారు. 

హీరో నుంచి సీఎంగా..

2024లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన విజయ్.. తన సినీ ప్రయాణానికి వీడ్కోలు పలికి రాజకీయాలపై దృష్టి సారించారు. 2026లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన ప్రయాణం మరో మలుపు తిరిగింది. విజయ్‌పై సమంత వ్యక్తం చేసిన అభిమానం ఇప్పుడు మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం సామ్ తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఎంతో హ్యాపీగా, హెల్దీగా గడుపుతున్నారు.  డిసెంబర్ 2026 నాటికి సమంత డెలివరీ కానున్నట్లు సమాచారం.