కేరళ గవర్నర్ బంగ్లాలో ఓన్లీ వెజ్: చికెన్, మటన్ వద్దన్న కొత్త గవర్నర్ నిర్ణయంపై వివాదం

కేరళ గవర్నర్ బంగ్లాలో ఓన్లీ వెజ్: చికెన్, మటన్ వద్దన్న కొత్త గవర్నర్ నిర్ణయంపై వివాదం

కేరళ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాథుర్ తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్‌భవన్ కిచెన్‌లో పూర్తిగా శాకాహారం అంటే వెజిటేరియన్ వంటకాలు మాత్రమే వండాలని తొలిరోజే ఆదేశాలు జారీ చేయడంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సీపీఐ(ఎం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేరళ 29వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఈ వివాదం స్టార్ట్ అయ్యింది.

రాజ్‌భవన్ కిచెన్ లో ఇకపై మాంసాహార వంటకాలు తయారు చేయకూడదని, వడ్డించకూడదని మాథుర్ ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై రాజ్ భవన్ వర్గాలు స్పందిస్తూ.. గవర్నర్ కఠిన శాకాహారి కావడంతోనే ఈ మార్పు చేశారని, ఉద్యోగుల ఆహారపు అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వివరణపై రాజకీయ పక్షాలు మాత్రం మండిపడుతున్నాయి.

ఈ నిర్ణయం సంఘ్ పరివార్ అజెండాను అమలు చేయడంలో భాగమేనని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. కేరళలో తీరప్రాంతం కారణంగా సమృద్ధిగా లభించే చేపలు, మాంసాహారాన్ని నిషేధించేలా గవర్నర్ వ్యక్తిగత రుచులను రుద్దడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఈ ప్రయత్నాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేరళ హోంమంత్రి రమేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మనిషి ఏం తినాలో, ఏం ధరించాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదన్నారు.

భారతదేశంలో శాకాహార, మాంసాహార ఎంపిక ప్రజాస్వామిక హక్కు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ పేర్కొన్నారు. ఆహారాన్ని కూడా మతపరమైన ఆయుధంగా మార్చాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కేరళ సంప్రదాయ జీవన శైలిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని గవర్నర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ వ్యక్తిగత ఆహారపు అలవాట్లను ఎవరూ తప్పుపట్టకపోయినా.. అధికారిక భవనంలో అందరిపై రుద్దడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. గత గవర్నర్ల హయాంలో రాజ్‌భవన్ వంటగదిలో మాంసాహారం వండేవారని వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా.. ఓం ప్రకాష్ మాథుర్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఈ నిర్ణయం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.