పెద్ద చదువులు, హైశాలరీ ప్యాకేజీలు, కంపెనీలో కీలక హోదాలు.. ఇవి ఏ ఉద్యోగికైనా కల లాంటివే. కానీ నేటితరం 'జెన్-జీ' యూత్ ఆలోచనా ధోరణి వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంది. ఉన్నత పదవులు కావాలని కోరుకుంటున్నప్పటికీ.. అవే సర్వస్వమని భావించడం లేదు. ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, కెరీర్ లక్ష్యాలపై నేటి యువత వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకే జాబ్ లో ఏళ్ల తరబడి ఉండిపోవటానికి ఇష్టపడని జెన్-జీ యువత.. తమ కెరీర్, జీతాల విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
తాజా సర్వేల ప్రకారం.. ఉద్యోగాల ఎంపిక, వేతనాల విషయంలో జెన్-జీ ఆలోచనలు క్రేజీగా మారుతున్నాయి. సుమారు 77% మంది తాము చేసే ఉద్యోగమే తమ డ్రీమ్ జాబ్ అని భావిస్తున్నప్పటికీ, సగటున కేవలం 13 నెలలు మాత్రమే ఒకే చోట పనిచేస్తున్నారని రాండ్స్టాడ్ స్టడీలో వెల్లడైంది. ఇక డెలాయిట్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 96% మంది యువత పెద్ద పదవులు కోరుకుంటున్నట్లు తెలిపినా, వారిలో కేవలం 9% మందికి మాత్రమే ఆ పెద్ద పోస్టే జీవితపు ఏకైక లక్ష్యంగా ఉంది. అంటే హోదా ముఖ్యమే కానీ.. అదే జీవితం కాదనేది వారి స్పష్టమైన అభిప్రాయం.
శాలరీలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో జెన్-జీ ఎక్కడా రాజీ పడటం లేదు. దాదాపు 81% మందికి ఉద్యోగంలో జీతమే అన్నింటికంటే ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. అదే సమయంలో 57% మంది తమ వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగానికి మధ్య సరైన సమతుల్యత అదేనండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ భావం కూడా వారిని వేధిస్తోంది. 29% మంది తాము ఆర్థికంగా అభద్రతలో ఉన్నట్లు భావిస్తుండగా.. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా కీలక నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. కేవలం జీతం మాత్రమే కాకుండా.. ఇంటి అద్దెలు, జీవన వ్యయాలు కూడా తమ కెరీర్ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు 60% మంది యువత అంగీకరిస్తున్నారు.
మొత్తానికి ఉద్యోగం అంటే జీవితాన్ని త్యాగం చేయడం కాదని జెన్ జీ అభిప్రాయం. నైపుణ్యాలను పెంచుకుంటూ AI వంటి అధునాతన టెక్నాలజీల్లో రాణిస్తూనే.. ఆకర్షణీయమైన వేతనం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తోంది జెన్-జీ. పాత తరాల మాదిరిగా ఒకే చోట స్థిరపడాలనే పాత కాలం ఆలోచనలకు గుడ్ బై చెప్పేసి.. తమకు నచ్చినట్లు కెరీర్ను మలచుకుంటున్న ఈ ట్రెండ్ కార్పొరేట్ ప్రపంచంలో కొంత ఆందోళనలు కలిగిస్తోంది.
