శబరిమలలో నెయ్యి కుంభకోణం: 11 వేల లీటర్లు దారిమళ్లింపులో ఎవరున్నారు..?

శబరిమలలో నెయ్యి కుంభకోణం: 11 వేల లీటర్లు దారిమళ్లింపులో ఎవరున్నారు..?

కోట్ల మంది భక్తులు శబరిమలలో ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదంలో అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన 'అరవణ పాయసం' తయారీ కోసం ఉపయోగించే స్వచ్ఛమైన మిల్మా నెయ్యిని దారి మళ్లించి.. దానికి బదులుగా నాసిరకం, చౌకైన నెయ్యిని సరఫరా చేసిన బాగోతం బయటపడింది. ఈ కుట్రకు సంబంధించి విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఒక రవాణా కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయడం కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

శబరిమల ఆలయానికి సరఫరా కావాల్సిన దాదాపు 11వేల లీటర్ల స్వచ్ఛమైన మిల్మా నెయ్యిని మధ్యలోనే దారి మళ్లించినట్లు తిరువిదాంకూర్‌ దేవస్వం బోర్డు పేర్కొంది. కేరళ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు చెందిన పతనంతిట్ట డైరీ నుంచి ఈ నెయ్యిని సేకరించి.. కొండపైకి చేరవేయాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్ ఎస్‌.ఎస్‌. బినుకు అప్పగించారు. అయితే బిను ఫ్యూర్ నెయ్యిని తమిళనాడులోని తిరుప్పూర్‌ సమీపంలోని ఒట్టంచత్రం ప్రాంతానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, లియో ట్రేడర్స్ అనే 2 ఏజెన్సీలకు తరలించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అసలు నెయ్యికి బదులుగా తక్కువ రేటు నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసి, నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించాడు సదరు కాంట్రాక్టర్. ఈ అక్రమాల వల్ల దేవస్వం బోర్డుకు ఏకంగా రూ.2 కోట్ల 50లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

కేరళ హైకోర్టు జోక్యం..
శబరిమలకు సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై కేరళ హైకోర్టు సీరియస్‌ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించడంతో విజిలెన్స్ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. నిశితంగా పరిశోధనలు జరిపిన అధికారులు.. రవాణా కాంట్రాక్టర్ ఎస్‌.ఎస్‌. బినును విచారణకు పిలిచి, ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో ఇదే తొలి అరెస్టు.

అయ్యప్ప స్వామికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సమర్పించే అరవణ ప్రసాదం తయారీలో ఈ రకమైన కల్తీ జరగడం కోట్లాది మంది భక్తులను తీవ్రంగా కలచివేసింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనూ అవినీతికి పాల్పడి, భక్తుల ఆరోగ్యంతో, మనోభావాలతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి భక్తుల నుంచి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, అసలు కుభకోణం ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది, ఎవరెవరికి వాటాలు పోతున్నాయి అనే అంశాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.