ఉన్న ఉద్యోగం మానే సాహసం చేయెుద్దు: జాబ్ మార్కెట్ రియాలిటీ షేర్ చేసిన టెక్కీ

ఉన్న ఉద్యోగం మానే సాహసం చేయెుద్దు: జాబ్ మార్కెట్ రియాలిటీ షేర్ చేసిన టెక్కీ

భారతీయ ఐటీ ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న లైఫ్‌స్టైల్ ఖర్చులు, గృహ బడ్జెట్‌లపై పడుతున్న భారంతో సతమతమవుతున్న ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన టెక్ నిపుణుడు అమర్‌నాథ్ శివశంకర్ ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్‌లు, పెరగని జీతాలు, విపరీతమైన పోటీ వంటి వాస్తవ పరిస్థితులను తన పోస్ట్ ద్వారా కళ్లకు కట్టారు.

టెక్నికల్ మేనేజర్ పోస్ట్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల అనుభవాలను అమర్‌నాథ్ పంచుకున్నారు. గ్లోబల్ ఐటీ సంస్థ తమ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఇప్పటికీ ఉపాధి కోసం వెతుకుతుండగా.. మరో అభ్యర్థి గత 3 ఏళ్లుగా జీతం పెరగకపోవడంతో స్వయంగా రాజీనామా చేసి నిరుద్యోగిగా మిగిలిపోయినట్లు తెలిపారు. గడిచిన మూడేళ్లలో అన్ని రంగాల్లోనూ ఖర్చులు విపరీతంగా పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ.. చాలా మంది ఐటీ ఉద్యోగులు బ్యాడ్ టైం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏకైక పరిష్కారం ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోకుండా అలాగే కొనసాగడమేనని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. గుడ్డిగా ఆశావాదిగా ఉండటం కంటే వాస్వవికంగా ఆలోచించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేవలం నైపుణ్యాలు ఉంటే సరిపోదని, మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై విపరీతంగా పెరిగిపోవడంతో.. అర్హులైన నిపుణులకు కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం లేదని చెప్పారు. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీల వల్ల ఎంట్రీ బారియర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు సైతం తమ అనుభవాలను పంచుకుంటూ స్పందిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉద్యోగంలో చేరిన తమ బంధువు.. రోజూ 13 గంటలు పనిచేయాల్సి రావడం, వీకెండ్స్‌లోనూ విశ్రాంతి లేకపోవడంతో ఉద్యోగం మానేశారని, గత 3 నెలలుగా సరైన అవకాశాలు దొరకలేదని ఒక వినియోగదారుడు కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం ఎలా ఉన్నా ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని వేలాడటమే మేలని మరొకరు అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో నెలకొన్న ఈ సంక్షోభం నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.