25 వేల కోట్ల రూపాయల దివాళీ వ్యాపారం ప్రమాదంలో ఉందా..: రాహుల్ గాంధీ ర్యాలీతో సంబంధం ఏంటీ..?

25 వేల కోట్ల రూపాయల దివాళీ వ్యాపారం ప్రమాదంలో ఉందా..: రాహుల్ గాంధీ ర్యాలీతో సంబంధం ఏంటీ..?

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ తలపెట్టిన ఇండియా బ్లాక్ మహా ర్యాలీతో వ్యాపారులకు నష్టమా.. తమ వ్యాపారాలు దెబ్బతింటాయి అని నవంబర్ 1న నిర్వహించనున్న కాంగ్రెస్ మహార్యాలీ  వాయిదా వేసుకోవాలని ఢిల్లీలోని వ్యాపార సంఘాలు రాహుల్ గాంధీని కోరుతున్నారు. అసలు రాహుల్ గాంధీ ర్యాలీకి, ఢిల్లీ వ్యాపారుల వ్యాపారానికి సంబంధం ఏమిటీ.. నవంబర్ 10న భాయ్ దూజ్ ముగిసే వరకు ఇండియా బ్లాక్ ర్యాలీని వాయిదా వేయాలని CTI చైర్మన్ బ్రిజేష్ గోయల్ రాహుల్ గాంధీని కోరడం చర్చనీయాంశమైంది. 

రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల సంఘం ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI )చైర్మన్ బ్రిజేష్ గోయల్ ఓ లేఖ రాశారు. అందులో  నవంబర్ 1న  తలపెట్టిన ఇండియా బ్లాక్  మహా ర్యాలీని వాయిదా వేసుకోండి అని కోరారు. దీపావళి పండుగ వేళ ఢిల్లీలో వ్యాపారం జోరుగా సాగే సమయం కాబట్టి నవంబర్ 10 న భాయ్ దూజ్ పండుగ ముగిసే వరకు ఈ ర్యాలీ వాయిదా వేసుకుంటే వ్యాపారులకు మేలు జరుగుతుందని అన్నారు. 

భారీ నష్టం వాటిల్లే ప్రమాదం..?

పండుగ సీజన్ పీక్‌లో ఉన్ క్రమంలో ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల సుమారు రూ.10వేలకోట్ల మేర వ్యాపార లావాదేవీలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపార సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబరులో జరిగిన కొన్ని నిరసనల వల్లే ఇప్పటికే దాదాపు రూ.3వేల కోట్ల నష్టం వచ్చిందని రాహుల్ కు వివరించారు. 

ప్రభావితమయ్యే మార్కెట్లు..

రామ్‌లీలా మైదాన్ పరిసర ప్రాంతాల్లో చాందినీ చౌక్, సదర్ బజార్, ఖారీ బావలి వంటి దాదాపు 20 ప్రధాన హోల్‌సేల్, రీటెయిల్ మార్కెట్లు ఉన్నాయి. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడ్లు విధిస్తే పండుగ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్ల రాక తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక..

నవంబర్ 6న ధంతేరస్, నవంబర్ 8న దీపావళి, నవంబర్ 10న భాయ్ దూజ్ పండుగలు ఉన్నాయి. ధంతేరస్ సమయంలోనే ఢిల్లీలో బంగారం, ఎలక్ట్రానిక్స్, బట్టలు తదితర రంగాల్లో రూ.25వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని, ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకమని లేఖలో వివరించారు. 

ప్రజా రవాణాకు ఇబ్బందులు..

ర్యాలీ నిర్వహిస్తే రోడ్ల మూసివేతతో పాటు, సమీపంలోని పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు, వ్యాపారులు, అలాగే ఆస్పత్రులకు వెళ్లే అంబులెన్స్‌ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.