తిరుపతి జిల్లాలో పంటపొలాల్లో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది.శనివారం ( అక్టోబర్ 24 ) తిరుపతి-చిత్తూరు జిల్లా సరిహద్దులోని ఐరాల మండలం చుక్కావారి పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చుక్కావారి పల్లి సమీపంలోని పంట పొలాల్లో అడవి ఏనుగు మృతి చెందింది.
ఇవాళ ఉదయం పొలానికి వెళ్లిన రైతులు ఏనుగు మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో తక్కువ ఎత్తులోనే హైటెన్షన్ వైర్లు ఉండటంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏనుగు శరీరం మీద కూడా మూడు చోట్ల కరెంటు వైర్లు తగిలినట్లు గుర్తులు కనిపిస్తున్నాయని అంటున్నారు రైతులు.
గత కొంతకాలంగా ఐరాల మండలంలోని చుక్కావారి పల్లి, గుబాలవారి పల్లి, పాకాల మండలంలోని కాకర్లవారి పల్లి, సిలగొందిమూల అటవీ ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు రైతులు. శుక్రవారం రాత్రి మూడు ఏనుగులు పొలాల వైపు వచ్చినట్లు తెలిపారు రైతులు. ఇవాళ ఏనుగు మృతి చెందిన ఘటనపై అటవీ అధికారులకు సమాచారం అందించారు రైతులు.
