భవిష్యత్ సినీ నిర్మాతలను భయపెట్టాలని బీజేపీ చూస్తోంది.. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఘటనపై నసీరుద్ధీన్ షా

భవిష్యత్ సినీ నిర్మాతలను భయపెట్టాలని బీజేపీ చూస్తోంది.. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఘటనపై నసీరుద్ధీన్ షా

భవిష్యత్ సినీ నిర్మాతలను భయపెట్టాలని బీజేపీచూస్తోందని అన్నారు సినీ నటులు నసీరుద్ధీన్ షా. కోల్ కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ)లో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా, దర్శకురాలు పాయల్ కపాడియా 2026 అక్టోబర్ 24న మద్దతు తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు అనుబంధ సంస్థలు క్యాంపస్‌లోకి చొచ్చుకొచ్చి దాడులు చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇద్దరూ స్పందించారు.

 నసీరుద్దీన్ షా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న బీజేపీ తమ నమ్మకాలు, విధానాను  వ్యతిరేకించే వారిపై పగ తీర్చుకుంటోందని  ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన  తర్వాత బీజేపీ తమకు వ్యతిరేకం అనుకున్న వాళ్లపై పగ తీర్చుకోవడానికి దాడులకు దిగుతోందని అన్నారు.  ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ విద్యార్థులు ఇప్పుడు ఆ వేండెట్టాకు బలైపోతున్నారని షా ఆవేదన వ్యక్తం చేశారు. 

 భవిష్యత్ సినిమా నిర్మాతలను మెదడు కడగాలని లేదా భయపెట్టాలని బీజేపీ ఆశిస్తోంది. కానీ అలా జరగదని నేను హామీ ఇస్తున్నాను అని ఆయన స్పష్టం చేశారు. స్వతంత్ర సినిమా నిర్మాణం, వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో నొక్కి చెప్పిన షా, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు దేశ సామాజిక, రాజకీయ వాస్తవాలను  విశ్లేషించేందుకు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వీరు భవిష్యత్తులో మన గురించి, మన దేశం గురించి, మన స్థితి గురించి నిజం చెప్పే యువత. వారి డిమాండ్లకు మద్దతు ఇవ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు.

2024 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాకు గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా ఎస్ఆర్‌ఎఫ్‌టీఐలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిగా నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. విద్యార్థులు సెప్టెంబర్ 27న అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ (ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ) సభ్యులు, అక్టోబర్ 4న బంగీయ హిందూ జాగరణ్ మంచ్ ర్యాలీ సందర్భంగా దాడులకు గురయ్యారని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి తరగతులు నిలిచిపోయాయని తెలిపారు. 

విద్యార్థులు వైస్ చాన్సలర్ సంతోష్ అజ్మేరా రాజీనామా చేయాలని కోరుతూ నిరవధిక ధర్నా చేస్తున్నారు. అక్టోబర్ 16న ఇన్‌స్టిట్యూట్ నవంబర్ 13 వరకు ఫిల్మ్‌మేకింగ్, వీడియో క్లాసులు నిలిపివేసి, విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చింది. విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. కానీ దాడులు చేసి, మహిళా విద్యార్థినులను తాకిన వారిపై ఎలాంటి చర్యలు లేవు అని కపాడియా ఆరోపించారు. భద్రతా సమస్యల గురించి ప్రశ్నించినందుకు రస్టికేషన్ బెదిరింపులు ఉన్నాయని, పరిస్థితి అత్యంత ఆందోళనకరం అని ఆమె అన్నారు. విద్యార్థుల భద్రత ప్రమాదంలో ఉందని, హింసను ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ విద్యార్థి సంఘం ప్రతినిధి సుదీప్ చక్రవర్తి మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించాలి. క్యాంపస్‌లో అనధికార కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలి. సినిమా విద్యకు సురక్షితమైన, స్వతంత్రమైన ప్రదేశంగా ఇన్‌స్టిట్యూట్ కొనసాగాలని మేము కోరుతున్నాము అని అన్నారు.