వారంలోపు  మా సమస్యలు పరిష్కరించాలి..వేధింపులు ఆపాలి.. ఇంటర్ బోర్డుకు యాజమాన్యాల అల్టిమేటం

వారంలోపు  మా సమస్యలు పరిష్కరించాలి..వేధింపులు ఆపాలి.. ఇంటర్ బోర్డుకు యాజమాన్యాల అల్టిమేటం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం (TPJMA) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని గౌరి సతీష్ ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా అఫిలియేషన్ ప్రక్రియలో కళాశాలల యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

గత సంవత్సరం 548 కళాశాలల నుంచి సుమారు రూ.5.48 కోట్ల వరకు వసూలు చేశారని ఆయన తెలిపారు. ఫైర్ ఎన్‌ఓసీల విషయంలో అధికారికంగా పొందిన ధ్రువపత్రాలను ఇప్పుడు నకిలీవిగా పేర్కొంటున్నారని ఆరోపించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న తమను, తాము చేయని తప్పులకు బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది అఫిలియేషన్ కోసం 1,432 కళాశాలలు దరఖాస్తు చేసుకోగా, 1,256 కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఇచ్చారని, మరో 158 కళాశాలలకు ఇంకా గుర్తింపు ఇవ్వలేదని గౌరి సతీష్ వెల్లడించారు. 27 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నాయని బోర్డు అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో అమలులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రూ.8 లక్షల జరిమానాపై వివరణ ఇవ్వాలి

ఏ నిబంధన ప్రకారం రూ.8 లక్షల జరిమానా విధించారో బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వాలని గౌరి సతీష్ డిమాండ్ చేశారు. తాము నిబంధనలకు అనుగుణంగానే కళాశాలలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండకూడదన్నట్లుగా ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా, బోర్డు చెప్పినట్లే నడుచుకోవాలని యాజమాన్యాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

టాస్క్‌ఫోర్స్‌ను ఉపసంహరించుకోవాలి

కళాశాలలపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి యాజమాన్యాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గౌరి సతీష్ ఆరోపించారు. బోర్డు కార్యదర్శి వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.