35 కు పైగా కేసుల్లో నిందితుడు.. పాతబస్తీలో రౌడీషీటర్ లల్లా అరెస్ట్

 35 కు పైగా కేసుల్లో నిందితుడు.. పాతబస్తీలో రౌడీషీటర్ లల్లా అరెస్ట్

హైదరాబాద్: పాతబస్తీలోని మంగళ్‌హాట్ పోలీసులకు పరారీలో ఉన్న రౌడీషీటర్ అబేద్ బిన్ ఖలీద్ అలియాస్ అబేద్ అలియాస్ లల్లా చిక్కాడు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 35కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 బైక్‌తో పాటు పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

2005 నుంచి నేర కేసులు.. మూడుసార్లు పీడీ యాక్ట్

పోలీసుల వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.కె.పేట్, చిస్తిచమన్ ప్రాంతానికి చెందిన అబేద్ (36)పై 2005 నుంచి పలు  నేరాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. 2008లో అతడిపై రౌడీషీట్ తెరిచారు. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆరు నెలలుగా పరారీ

ఇటీవల మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎన్‌డీపీఎస్, ఆర్మ్స్ యాక్ట్ కేసులతో పాటు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులోనూ అబేద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్‌లో ఉంది. ఆరు నెలలకు పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడి కోసం పోలీసులు నిఘా కొనసాగించారు.

ఆర్.కె.పేట్ జంక్షన్ వద్ద పట్టివేత

ఈ క్రమంలో అక్టోబర్ 23న విశ్వసనీయ సమాచారం అందడంతో ఆర్.కె.పేట్ జంక్షన్ వద్ద అబేద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ లేని తెల్లరంగు బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 మోటార్‌సైకిల్‌తో పాటు పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 470/2026 కింద ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1B)(b) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.