బీజేపీ హర్యానా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన మొదటి పర్యటనలోనే రాష్ట్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులందరి భద్రతను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
2 రోజుల పాటు సాగిన ఈ పర్యటన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె పలు కీలక సమావేశాలు నిర్వహించారు. గురుగ్రామ్ బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ కార్యాలయం వెలుపల ఉన్న అధిక భద్రతా ఏర్పాట్లపై ఆమెకు కొద్ది రోజుల క్రితం పలు ఫిర్యాదులు అందాయి. పంచకుల జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె.. అనవసరమైన అదనపు భద్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత నెలలో స్మృతి ఇరానీని బీజేపీ హర్యానా వ్యవహారాల ఇన్చార్జ్గా పార్టీ హైకమాండ్ నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణ కార్యకర్తలకు, నాయకులకు మధ్య దూరం తగ్గించడమే ఈ నిర్ణయ ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా పంచకుల జరిగిన సమావేశాలపై హర్యానా ఆరోగ్య మంత్రి ఆర్తీ సింగ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంపై ఈ చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయని ఆమె తెలిపారు. శుక్రవారం జరిగిన అత్యంత కీలకమైన సమావేశంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ.. ఇరానీతో పాటు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, రావు ఇంద్రజిత్ సింగ్, రాష్ట్ర మంత్రి అనిల్ విజ్, హర్యానా బీజేపీ చీఫ్ అర్చనా గుప్తా తదితరులు పాల్గొన్నారు.
