నా హక్కులను హరించడమే.. పీస్ బాండ్‎పై సంతకం చేసే ముచ్చటే లేదు: నేహా బోరా

నా హక్కులను హరించడమే.. పీస్ బాండ్‎పై సంతకం చేసే ముచ్చటే లేదు: నేహా బోరా

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు జారీ చేసిన పీస్ బాండ్‎పై సంతకం చేసేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా నిరాకరించారు. పీస్ బాండ్‌పై సంతకం చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం శాంతికి భంగం కలిగించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల జారీ చేసిన నోటీసుపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆమె తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ నేహో బోరా దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 

అసలు ఏం జరిగిందంటే..?

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 16న సీజేపీ తలపెట్టిన లెహ్రో దో తిరంగా మార్చ్‎లో ఢిల్లీ పోలీసులు నేహా బోరాను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విడుదల చేశారు. అయితే, విచారణ సమయంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుతో కూడిన పీస్ బాండ్ సమర్పించాలని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నేహా బోరాకు నోటీసు జారీ చేసింది. 

పీస్ బాండ్‎పై సంతకం చేసేందుకు నిరాకరించిన నేహా బోరా ఢిల్లీ పోలీసుల నోటీసును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసు శాంతియుత నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్‎లో ఆమె పేర్కొన్నారు. 

నేహా బోరా పదేపదే నిరసన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, నిషేధిత ప్రాంతాల వైపు వెళ్లాల్సిందిగా ప్రదర్శనకారులను ప్రోత్సహించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు నేహా బోరా పిటిషన్‎ను తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ పీస్ బాండ్‎పై సంతకం చేయబోనని నేహా తేల్చిచెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేసింది.