నీతి కథ: ధనవంతులను దోచి పేదలకు సాయం చేసిన దొంగ .. మహారాజు వేసిన శిక్ష ఏంటి..?

నీతి కథ:  ధనవంతులను దోచి పేదలకు సాయం చేసిన దొంగ .. మహారాజు వేసిన శిక్ష ఏంటి..?

సింహపురి రాజ్యాన్ని మహేంద్రవర్మ పరిపాలించేవాడు. రాజ్యం సుభిక్షంగా ఉండేది. మంత్రిని ఎప్పటికప్పుడు రాజ్యం గురించి అడిగి తెలుసుకునేవారు మహేంద్రవర్మ. “ఇప్పటివరకు రాజ్యంలో ఎటువంటి సమస్యలు రాలేదు మహారాజా! అందరూ బాగున్నారు" అని చెప్పేవాడు మంత్రి.

కొద్దిరోజుల తర్వాత కొంతమంది ధనికులు, వ్యాపారస్తులు, మహేంద్రవర్మను కలిశారు. "మహారాజా! రాజ్యంలో ముసుగు దొంగ పడ్డాడు. బాగా ధనమున్న వారి ఇళ్లను ఎంచుకొని అర్ధరాత్రిళ్లు ఆ ఇళ్లలోకి చొరబడి బెదిరించి ధనాన్ని కాజేస్తున్నాడు" అంటూ వాపోయారు. మహారాజు సందిగ్ధంలో పడ్డాడు " ఇలా ఎంత కాలం నుండి జరుగుతోంది" అని అడిగాడు. "దాదాపుగా రెండు మాసాలు పైబడింది మహారాజా" అని చెప్పారు వాళ్లు. "మీరు వెళ్ళండి. త్వరలో ఆ దొంగని పట్టుకొని శిక్షిస్తాం" అంటూ వాళ్లని పంపించేశాడు మహారాజు.

వెంటనే మహామంత్రిని పిలిచి విషయం చెప్పాడు. ఆ దొంగను పట్టుకోవాలని కొంతమంది గూఢచారులను నియమించి రాత్రి వేళలో రాజ్యంలోకి రహస్యంగా పంపించాడు. అయినా కూడా దొంగ దొరకలేదు. ఎక్కడో ఒకచోట దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. మహేంద్రవర్మకు ఇదొక పెద్ద చిక్కుగా మారింది. ఎంతో ప్రయత్నించగా ఆ దొంగ ఎడమచేతి మణికట్టు దగ్గర పెద్ద పుట్టుమచ్చ ఉందని తెలిసింది. 

రాజ్యంలో ఉన్న మగవాళ్లందరిని తన భవనానికి రప్పించాడు. అందరినీ పరిశీలించాడు.. ఎవరి చేతికి మచ్చలేదు. “మరి ఎవరు చేస్తున్నట్టు?” అని దీర్ఘంగా ఆలోచించాడు. రాజ్యంలో దండోరా వేయించాడు. “ఎవరైతే రాత్రిపూట దొంగతనం చేస్తున్నారో వాళ్లంతట వాళ్లు వచ్చి లొంగిపోతే.. తప్పు ఒప్పుకున్నందుకు పది వేల వరహాలు బహుమానం. అలా కాకుండా పట్టుబడితే మరణదండన విధిస్తారహో” అని దండోరా వేయించాడు మహారాజు.

ALSO READ : డైనోసార్లు తిరిగిన నేల.. దశావతారాలు పొదిగిన కోన..

రోజులు గడుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. ఒకరోజు ఉదయం ఒకతను రాజమందిరానికి వచ్చాడు. "ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?" అని అడిగాడు మహారాజు. “మీరు ఇన్నాళ్లు వెతుకుతున్న ఆ దొంగను నేనే మహారాజా! లొంగిపోతే పదివేల వరహాలు ఇస్తామంటే వచ్చాను" అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. వచ్చిన అతను హుందాగా ఉన్నాడు. మంచి దుస్తులు ధరించి రాజకుమారుడిలా కనిపిస్తున్నాడు.

 "నువ్వు దొంగలా కనిపించడం లేదు. ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తిలా ఉన్నావు" అన్నాడు మహారాజు. “లేదు మహారాజా! ఆ దొంగను నేనే. నా ఎడమ చేతి మణికట్టుపై పుట్టు మచ్చ కూడా ఉంది. కావాలంటే చూడండి" అని తన చేతిని చూపించాడు.

వెంటనే దొంగతనానికి గురైన ఇళ్ల యజమానులను అక్కడికి పిలిపించాడు రాజు. అప్పుడు అతనే అసలైన దొంగని తెలిసిపోయింది. "దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ గట్టిగా నిలదీశాడు మహారాజు. "మహారాజా! వీళ్లు వ్యాపారం ముసుగులో అమాయకులను మోసం చేసి, దండిగా ధనం కూడబెట్టారు. రాజ్యంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం ఉన్నవాళ్లను దోచి పేదవాళ్ల ఆకలి తీర్చాను. తప్పయితే నన్ను శిక్షించండి" అన్నాడు. ఆ నిజం వారిచేతనే రుజువు చేయించాడు.

"నిజమే దొంగతనం చేసిన సొమ్ము నువ్వు తినలేదు. పేదవాళ్ల ఆకలి తీర్చి మంచి దొంగ అనిపించుకున్నావు. బాగానే వుంది. కానీ బెదిరించి లాక్కెళ్ళడం నేరం. దొంగతనం చేసాక ఎంతమందికి సాయం చేసినా.. అది లెక్కలోకి రాదు. దొంగతనం దొంగతనమే. కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే" అన్నాడు మహారాజు.

"నేను లొంగిపోయాను మహారాజా. తప్పు ఒప్పుకుంటున్నాను కదా" అన్నాడతను. "తప్పు ఒప్పుకున్నందుకు శిక్ష తగ్గిస్తున్నాను. మూడు నెలలు తోటపని చేయాలి. నీ క్రమశిక్షణను బట్టి ఎప్పుడు విడుదల చేయాలనుకుంటే అప్పుడు చేస్తాం" అన్నాడు మహారాజు. "ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకోండి. అమాయకులను దోచుకున్నారో, మిమ్మల్ని కూడా శిక్షించాల్సి వస్తుంది" అంటూ వ్యాపారస్తుల్ని పంపించాడు మహారాజు, మహారాజు తెలివిని... దొంగకు వేసిన శిక్షని అందరూ మెచ్చుకున్నారు.

- నరెద్దుల రాజారెడ్డి