Diwali Movies: దీపావళి బాక్సాఫీస్‌పై టాలీవుడ్ కన్ను.. బరిలో చిన్న సినిమాల నుంచి భారీ ప్రాజెక్టులు..

Diwali Movies: దీపావళి బాక్సాఫీస్‌పై టాలీవుడ్ కన్ను.. బరిలో చిన్న సినిమాల నుంచి భారీ ప్రాజెక్టులు..

‘దసరా’ కొత్త సినిమాలతో ఆడియన్స్‌ను అలరించింది. రణబాలి, జైలర్ 2 వంటి రెండు బడా సినిమాలు, క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి వంటి రెండు చిన్న సినిమాలతో దసరా సీజన్‌ను కంప్లీట్ చేసుకుంది టాలీవుడ్ బాక్సాఫీస్. ఇప్పుడు అందరి చూపు దీపావళి సీజన్‌పై పడింది. ఈ పండుగ వేళ థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న సినిమాల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ దీపావళి బరిలో ఏయే సినిమాలు ఉన్నాయి? ఏ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది? బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాలు మెప్పించే అవకాశం ఉంది? ఓ లుక్కేద్దాం...

అక్టోబర్ 30న నాలుగు సినిమాలు..

దీపావళి సీజన్‌కు అక్టోబర్ 30 నుంచే సినిమా సందడి మొదలుకానుంది. వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం, ఇట్లు అర్జున, కల్ట్, కిల్లర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే రోజు నాలుగు సినిమాలు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల దగ్గర పోటీ ఆసక్తికరంగా మారనుంది.

ఆదర్శ కుటుంబం: 

టైటిల్‌తోనే కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. పండుగ సీజన్‌లో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను మెప్పించడం ఈ సినిమాకు కీలకం కానుంది. ముఖ్యంగా వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ క్యూరియాసిటీ పెరిగింది. అంతేకాకుండా క్రైమ్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. 

ఇట్లు అర్జున:

 అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకుడు. అర్జునుడి పేరును గుర్తుచేసే టైటిల్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రంలో.. మాటలు రాని హీరో తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడనేది కథగా రూపొందింది. ముఖ్యంగా మాటలకంటే భావోద్వేగాలే ముఖ్యమనే పాయింట్‌తో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

కల్ట్: 

గోవాలోని ఓ ఐసోలేటెడ్ ఎస్టేట్‌లో జరిగే పార్టీకి వెళ్లిన వందలాది మంది, అక్కడ ప్రాణాలతో బయటపడేందుకు ప్రమాదకరమైన ఆటలో పాల్గొనాల్సి రావడం కథలోని ప్రధాన ఉత్కంఠ. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోయిన పరిస్థితుల్లో ప్రతి నిర్ణయం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదంగా మారుతుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సంభాషణలు తరుణ్ భాస్కర్ రాయగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా సర్వైవల్, హారర్, హింసాత్మక థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

కిల్లర్: 

జ్యోతి పూర్వజ్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌’ (KILLER). ‘శుక్ర’ ఫేమ్ పూర్వజ్‌‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక సైన్స్‌‌ ఫిక్షన్‌‌ యాక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌. ఈ సినిమాలోని మెయిన్ ట్విస్ట్‌ను కరెక్ట్‌గా గెస్ చేసిన వారికి రూ. 1 కోటి బహుమతిగా ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. మరి సినిమా చూసి ఆ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకునే అదృష్టశాలి ఎవరో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే!

రామాయణ పార్ట్ 1

దీపావళికి వస్తున్న భారీ ఇతిహాస చిత్రం రామాయణం పార్ట్ 1. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రెండు భాగాల సినిమాటిక్ ప్రాజెక్ట్‌లో ఇది తొలి భాగం. శ్రీరాముడి జీవితం, ధర్మానికి కట్టుబడి ఉండే ఆయన వ్యక్తిత్వం, వనవాసం, సీతాపహరణం, రావణుడితో సంఘర్షణకు దారితీసే పరిణామాలు ఈ ఇతిహాస గాథలోని కీలక అంశాలు.  నితేశ్ తివారీ దర్శకత్వం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఐమ్యాక్స్ స్థాయి నిర్మాణం ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. నవంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

సీన్ (తెలుగు డబ్)

ఇటీవల ‘విశ్వనాథ్‌‌ అండ్ సన్స్‌‌’ చిత్రంతో సక్సెస్ అందుకున్న  హీరో సూర్య.. ఇపుడు మరో కొత్త సినిమా ‘సీన్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జితూ మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించగా... 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ కీలకపాత్ర పోషించాడు. జగరం స్టూడియోస్,  2డి ఎంటర్‌‌టైన్‌‌మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో మూవీ నవంబర్ 6న రిలీజ్ కానుంది.

మహాశక్తి..

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం మహాశక్తి (Mookuthi Amman 2)కు తెలుగు వెర్షన్. సుందర్. C డైరెక్ట్ చేసిన ఈ డివోషనల్ థ్రిల్లర్ నవంబర్ 6, 2026న విడుదల కానుంది. పురాణ నేపథ్యం, శక్తిమంతమైన దేవీ అవతారం, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు విజువల్ గ్రాండియర్‌ను తీసుకురానున్నాయి. 

ALSO READ :  బిగ్‌బాస్ 10లో ఊహించని బిగ్ ట్విస్ట్..

సమ్మర్ హాలిడేస్

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌‌లో రూపొందిన  చిత్రం ‘సమ్మర్ హాలిడేస్‌‌’. శ్రీకర్‌‌‌‌ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. పిల్లల ప్రపంచం, వేసవి సెలవుల జ్ఞాపకాలు, తాతయ్య-అమ్మమ్మల ఊళ్లలో గడిపే బాల్యం చుట్టూ తిరిగే భావోద్వేగభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. 

నాన్న కుట్టి (తెలుగు డబ్)

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తాజా చిత్రం నాన్న కుట్టి. తమిళంలో అప్పా కుట్టి పేరుతో రూపొందిన ఈ సినిమాకు ము. మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి, కూతురి మధ్య ఉండే అపారమైన ప్రేమానుబంధాన్ని యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 6, 2026న ఈ సినిమా విడుదల కానుంది.

హతః:

దీపావళికి థియేటర్లలోకి వస్తున్న సరికొత్త థ్రిల్లర్ హతః. కుష్లు, రెహమాన్, నమ్రిత ఎం.వి., తనూజ పుట్టస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అనుష్ గోరక్ తెరకెక్కిస్తున్నారు. హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమా మొదటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నల్ల పిల్లి.. ఎర్రటి పెట్టె.. అంతుచిక్కని మిస్టరీతో సినిమా తెరకెక్కింది. నవంబర్ 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 

మొత్తానికి, ఈ దీపావళి బాక్సాఫీస్ దగ్గర వినోదానికి కొదవలేనట్టే కనిపిస్తోంది. ఓ వైపు భారీ విజువల్స్‌తో అబ్బురపరిచే ప్రాజెక్టులు.. మరోవైపు భావోద్వేగాలు, ఉత్కంఠ, కొత్త కథాంశాలతో అలరించేందుకు సిద్ధమవుతున్న చిన్న సినిమాలు! మరి వీటిలో ప్రేక్షకుల మనసులు గెలుచుకునేదెవరు? అంచనాలను అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది. చివరకు ప్రచార హంగులు కాదు.. కథలోని బలం, తెరపై చూపించే మ్యాజిక్, ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ టాక్‌నే ఈ పండుగ సీజన్‌లో సినిమా విజయాన్ని నిర్ణయించనున్నాయి.