క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు, మర్డర్ మిస్టరీలు, ఊహించని ట్విస్టులతో సాగే కథలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తూ ట్రెండ్ అవుతుంది. అదే ‘నా వైఫ్ మిస్సింగ్’ (Naa Wife Missing). అక్టోబర్ 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ.. మిస్సింగ్ మిస్టరీ, సస్పెన్స్, ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ తెరకెక్కించిన ఈ చిత్రంలో మిస్సింగ్ కేసు చుట్టూ అల్లుకున్న రహస్యాలు, ఉత్కంఠ రేపే పరిణామాలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు భార్య కనిపించకుండా పోవడానికి కారణమేంటి? ఈ మిస్సింగ్ కేసు వెనుక దాగి ఉన్న నిజాలేంటి? కథ ముందుకు సాగేకొద్దీ ఎలాంటి మలుపులు ఎదురవుతాయి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఈ సినిమా కథేంటి? సస్పెన్స్, ట్విస్టులు ఆడియన్స్ని చివరి వరకు ఎంగేజ్ చేస్తున్నాయా? లేదా? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..
Everyone has a story. Everyone has a secret. But who’s hiding the truth? 🕵️♂️ Watch #nawifemissingonaha now! https://t.co/0WQUFsIbO4 https://t.co/EAXmmak1qs
— ahavideoin (@ahavideoIN) October 22, 2026
కథేంటంటే:
బాలు (వరుణ్ సందేశ్), స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) వివాహం చేసుకుంటారు. అయితే, స్వప్నకు గతంలో అబాన్‌తో ఉన్న ప్రేమ వారి వైవాహిక జీవితంలో సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే స్వప్న అనూహ్యంగా కనిపించకుండా పోతుంది. భార్య కోసం పోలీసులను ఆశ్రయించిన బాలుపైనే అనుమానాలు మొదలవుతాయి. అసలు స్వప్న ఎక్కడికి వెళ్లింది? ఆమె అదృశ్యం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ కేసులో బాలు పాత్ర ఏమిటి? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది. మిస్సింగ్ కేసుతో పాటు మిస్టరీ, ఎమోషన్, సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ కి ఉత్కంఠరేపుతుంది.
విశ్లేషణ:
భార్య కనిపించకుండా పోవడం, ఆమెను వెతకాల్సిన భర్తే అనుమానితుడిగా మారడం అనే పాయింట్ థ్రిల్లర్‌కు మంచి పునాది. భార్యాభర్తల మధ్య విభేదాలు, స్వప్న గత ప్రేమ, బాలు చుట్టూ అల్లుకునే అనుమానాలతో దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ కథను ఉత్కంఠభరితంగా మలిచే ప్రయత్నం చేశారు. అసలు స్వప్న ఏమైంది? బాలు నిజంగానే అమాయకుడా? అబాన్ పాత్ర వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? అనే ప్రశ్నలు కథపై ఆసక్తిని పెంచుతాయి.
ఫస్టాఫ్‌లో బాలు, స్వప్నల వైవాహిక జీవితం, వారి మధ్య విభేదాలు, అబాన్ ప్రవేశం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కథలో అసలు మిస్టరీ మొదలయ్యే సమయానికి ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై క్యూరియాసిటీని కలిగిస్తుంది.
సెకండాఫ్‌లో పోలీసుల ఇన్వెస్టిగేషన్, స్వప్న ఆచూకీ కోసం చేసే ప్రయత్నాలు కథను ముందుకు తీసుకెళ్తాయి. అయినప్పటికీ, దర్యాప్తులో వేగం పెరిగి ఉంటే సినిమా మరింత ఉత్కంఠభరితంగా మారేది. అయినప్పటికీ ఎవరు చెప్పేది నిజం? ఎవరి వెనుక ఎలాంటి రహస్యం ఉంది? అనే ఉత్కంఠ ప్రేక్షకులను చివరి వరకు కథతో ప్రయాణించేలా చేస్తుంది. క్లైమాక్స్‌లో రహస్యాల వెనుక ఉన్న అసలు విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. అయితే, కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. అయినప్పటికీ.. ప్రేమ, అనుమానాలు, మిస్సింగ్ మిస్టరీని ఛేదించే సీన్స్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునే అంశాలుగా నిలుస్తాయి.
నటీనటుల పనితీరు..
బాలు పాత్రలో వరుణ్ సందేశ్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. భార్య మిస్ అయిన తర్వాత ఎదురయ్యే ఆందోళన, భావోద్వేగ సంఘర్షణలు, పోలీసుల విచారణలో ఎదురయ్యే ఒత్తిడిని తనదైన శైలిలో చక్కగా పలికించారు. కథలోని సస్పెన్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడంలో ఆయన నటన కీలకంగా నిలుస్తుంది. స్వప్న పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ తనదైన నటనతో మెప్పించారు. వరుణ్ సందేశ్‌తో ఆమె కెమిస్ట్రీ కథకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక అబాన్ పాత్రలో మోహిత్ పెద్దాడ తన నటనతో కథలో ఆసక్తిని పెంచారు.
